Editorials

తొలి తెలుగు వాగ్గేయకారుడు  అన్నమయ్య పుణ్యతిధి.

తొలి తెలుగు వాగ్గేయకారుడు  అన్నమయ్య పుణ్యతిధి.

అన్నమాచార్యులు క్రీ.శ. 1408 సం.లో నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు.

నందకాంశ సంభూతుడు.   వెంకటేశ్వరస్వామి వరప్రసాదిగా జన్మించిన అన్నమయ్య బాల్యంనుంచీ విష్ణుభక్తి పరాయణుడుగా ఎదిగాడు.

తన ఎనిమదవ  ఏటనుండీ సంకీర్తనలు రచించేవాడు. అజ్ఞానపు చీకటిలో  అలమటిస్తున్న జనులను తరింపచేయుటకు సంకీర్తనారచన ఒక్కటే శరణ్యమని భావించి ముప్ఫయిరెండు వేల సంకీర్తనలను రచించి తరతరాలవారికీ అందించిన గొప్ప వాగ్గేయకారుడు.

తిరుమల తిరుపతి దేవస్థానం కృషివల్ల  పధ్నాలుగువేల కీర్తనలు  వెలుగులోకి వచ్చాయి.అన్నమయ్య కీర్తనలు  కేవలం భక్తితత్వమే కాక ఎన్నో ప్రజాహిత బోధనలు, వైరాగ్య చింతనలు కలిగివుంటాయి.

పద్య సాహిత్యం విద్యావంతులు, పండితులయినవారు మాత్రమె ఆస్వాదించగలిగేవారు.  పదసాహిత్యం సామాన్యప్రజలకోసమే అవతరించిబడింది. అన్నివర్గాల జనులను జాగృతి చేసే శక్తి అన్నమయ్య పదసాహిత్యానికి ఉంది. అందుకే అన్నమయ్య ‘పదకవితా పితామహుడు’ అయ్యాడు.

ఆధ్యాత్మిక, భక్తీ, శృంగార,  వేదాంత కీర్తనలను వెంకటేశ్వర ముద్రాంకితముగా రచించిన ప్రతిభాశాలి!

ఆతని కీర్తనలలో ఎంత రసభావ సృష్టి కలదో! మనసులో ఎక్కడో ఉన్న సున్నితమైన భావాల్ని తట్టిలేపే పదప్రయోగం గోచరిస్తుంది. ఆ మహా వాగ్గేయకారుని సాహిత్యాన్ని వర్ణించగలవారము కాకపోయినా, అందులోని రసానుభూతిని ఆస్వాదించగలిగితే ధన్యులం.

అన్నమయ్య కీర్తనలను వెంకటేశ్వరస్వామి ముద్రతో రచించి ఆ స్వామికే అంకితంచేసిన ధన్యజీవి! అందుకే వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే అన్నమయ్యను స్మరించినట్లే. అన్నమయ్యను స్మరిస్తే స్వామిని స్మరించినట్లే!