భారత్ నుంచి పరారైన స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద, ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ దేశం పేరిట అమెరికాలోని 30 నగరాలతో ‘సాంస్కృతిక భాగస్వామ్యం’ చేసుకోవడం అమెరికావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అమెరికా నగరాలకు నిత్యానంద కుచ్చుటోపీ!
న్యూయార్క్, మార్చి 17: భారత్ నుంచి పరారైన స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద, ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ దేశం పేరిట అమెరికాలోని 30 నగరాలతో ‘సాంస్కృతిక భాగస్వామ్యం’ చేసుకోవడం అమెరికావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీసం ఆ పేరుతో నగరం ఉందో లేదో కూడా చూడకుండా నగరాలన్నీ వరసగా నిత్యానంద ప్రతినిధుల మాటల్ని నమ్మేశాయంటూ ఫాక్స్ న్యూస్ విమర్శలు గుప్పించింది. ‘‘కైలాసతో ఈ ఏడాది జనవరి 12న నెవార్క్ నగరం ‘సోదరి నగరం’గా ఒప్పందం చేసుకుంది. రిచ్‌మండ్, వర్జీనియా, డైటన్, ఒహాయో, ఫ్లోరిడా వంటి పెద్ద నగరాలు కూడా ఇలాంటి ఒప్పందాల్ని చేసుకున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస గురించి గూగుల్‌లో వెతికినా వివరాలు లభించేవి. కానీ అలాంటి ప్రయత్నాలేవీ అమెరికా నగరాలు చేయలేదు’’ అని ఫాక్స్ న్యూస్ సంస్థ వెల్లడించింది. ఇక.. ఒప్పందం చేసుకున్న నెవార్క్ నగర అధికారులు ఈ పరిణామంపై స్పందించారు. నిజం తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేశామని విచారం వ్యక్తం చేశారు.