NRI-NRT

అమెరికాలో మన టెకీల మెడపై… ‘గడువు’ కత్తి!

అమెరికాలో మన టెకీల మెడపై… ‘గడువు’ కత్తి!

ఉద్యోగాలు కోల్పోయి దుర్భర పరిస్థితి

ముగుస్తున్న ’60 రోజుల’ గ్రేస్ పీరియడ్

కొత్త కొలువు రాకుంటే దేశం వీడాల్సిందే

వేలాది కుటుంబాల్లో పెను సంక్షోభం |

బాధితుల్లో లక్ష మంది భారతీయులే |

వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ ప్రొఫెషనల్స్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (ఎస్ఇ ఐఐడీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. “సదరు కుటుంబాలకు ఇది పెను సంక్షోభం. వారికి చూస్తుండగానే సమయం మించిపోతోంది. అమెరికాలో పుట్టిన తమ పిల్లలను వెంటపెట్టుకుని వారి త్వరలో దేశం వీడాల్సిన పరిస్థితులు దాపురించాయి” అంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన 60 రోజుల గ్రేస్ పీరియడ్లోగా మరో ఉద్యోగం గానీ, ఉపాధి గానీ చూసుకోని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. జాబ్ మార్కెట్ అత్యంత ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కోవడం చాలామందికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. దొరికినా అత్యంత సంక్లిష్టంగా ఉన్న హెచ్ –1బీ మార్పు తదితర నిబంధనల ప్రక్రియను గ్రేస్ పీరియడ్లోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది.

ఈ నేపథ్యంలో దాన్ని కనీసం 180 రోజులకు పెంచాలంటూ ఆసియా అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్షుని సలహా కమిటీ ఇటీవలే సిఫార్సు చేయడం తెలిసిందే. “దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నా అవి ఆమోదం పొంది అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. ఈలోపు 60 రోజుల గ్రేస్ పీరియడ్ పూర్తయ్యే వారికి నిస్సహాయంగా దేశం వీడటం మినహా మరో మార్గం లేదు” అంటూ ఎఫ్ఎస్ఐఐడీఎస్ ఆవేదన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ పెంపు సిఫార్సును పరిశీలించి నిర్ణయం తీసుకునే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది.

భారీగా ఉద్వాసనలు…. గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలుకుని పలు దిగ్గజ కంపెనీలు కొన్నాళ్లుగా భారీగా ఉద్యోగుల తొలగింపు _బాట పట్టడం తెలిసిందే. దాంతో గత నవంబర్ నుంచి అమెరికాలో కనీసం 2.5 లక్షల మందికి పైగా ఐటీ తదితర ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. వీరిలో దాదాపు లక్ష మంది దాకా భారతీయులేనని అంచనా. ఆదాయ పన్ను చెల్లించే హెచ్ 1బి ఇమిగ్రెంట్లయిన వీరు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెదుక్కుని సదరు కంపెనీ ద్వారా హెచ్-1బికి దరఖాస్తు సుకోలేని పక్షంలో దేశం వీడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు” అని ఎఫ్ఎస్ఐఐడీఎస్ పేర్కొంది.