Editorials

ఉమేశ్ చంద్ర IPS… పవర్ ఆఫ్ పోలీస్!

ఉమేశ్ చంద్ర IPS… పవర్ ఆఫ్ పోలీస్!

*నేడు ఉమేష్ చంద్ర జయంతి. *

చదలవాడ ఉమేశ్ చంద్ర… ఈ పేరు చెబితే ఈ తరానికి తెలిసింది ఒక్కటే. అమీర్పేట్, ఎస్సార్నగర్ మధ్య ఉండే ఉమేశ్ చంద్ర స్టాచ్యూ. ఆ పోలీసాఫీసర్ విగ్రహం ఇప్పుడు ది గ్రేట్ హైదరాబాద్ లో అతిపెద్ద ల్యాండ్ మార్క్. ఆ ల్యాండ్ మార్క్ మీదుగా లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ల్యాండ్ మార్క్ నే తమ అడ్రస్ చెప్పుకుంటారు. ఇప్పుడిలా ల్యాండ్ మార్క్ చెప్పుకుంటున్న ఉమేశ్ చంద్ర… ఒకప్పుడు అసాంఘిక శక్తుల గుండెల్లో ల్యాండై మైన్. అవును… ఈ తరానికి ఉమేశ్ చంద్ర గురించి తెలిసింది తక్కువే. ఆయన గురించి చెప్పమంటే…. డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్లు కథలు కథలుగా చెబుతుంటారు. ఉమేశ్ చంద్ర అనుభవం ఈతరం పోలీసాఫీసర్లకు పాఠాలు. ఉమేశ్ చంద్ర కెరీర్ కాబోయే పోలీసులకు సిలబస్. అసలు ఎవరా ఉమేశ్ చంద్ర? ఆయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? ఆయన డిపార్ట్మెంట్ కు చేసిన సేవలేంటీ? ఆయన జీవితం అలా ముగియడానికి కారణమేంటీ? ఉమేశ్ చంద్ర జయంతి సందర్భంగా ప్రత్యేక కధనం

ఉమేశ్ చంద్ర… 1966 మార్చి 19న గుంటూరులో జన్మించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం, నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు. మ్యాథ్స్, ఎకనమిక్స్లో యూనివర్సిటీ టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. సివిల్స్ రాసి ఐపీఎస్గా ఎంపికయ్యారు. ముస్సోరీలో, హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తర్వాత వరంగల్ రూరల్ ఏఎస్పీగా తొలి పోస్టింగ్ వచ్చింది. 1991-92 మధ్య వరంగల్లో పనిచేశారు. అప్పుడు తెలంగాణలో నక్సలిజం ప్రభావం ఎక్కువ. యువత నక్సలిజంవైపు ఆకర్షితులవుతున్నట్టు ఉమేశ్ చంద్రకు అర్థమైంది. నక్సలిజాన్ని అంతం చేసేందుకు ‘జన జాగృతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐపీఎస్ గా డ్యూటీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే ఏకంగా నక్సలైట్లకు శతృవయ్యారు. 1992 అక్టోబర్లో పులివెందుల ఏఎస్పీగా బదిలీ అయ్యారు. కడప జిల్లాలో విధులు నిర్వర్తించడమంటనే రోజూ ఫ్యాక్షనిజంతో యుద్ధం చేయడమే.

వరంగల్లో నక్సలైట్లకు చుక్కలు చూపించిన ఉమేశ్ చంద్ర… అటు కడపలో ఫ్యాక్షనిస్టులను నా వదల్లేదు. అక్కడ పనిచేసింది కొంతకాలమే అయినా ఫ్యాక్షనిస్టులు గుండెల్లో నిద్రపోయారు. అప్పుడే యువ ఐపీఎస్ ఉమేశ్ చంద్ర పేరు డిపార్ట్మెంట్లో మార్మోగింది. ఛోటామోటా రౌడీల నుంచి బడాబడా ఫ్యాక్షనిస్టుల వరకు ఉమేశ్ చంద్ర పేరు వింటే హడలిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డిని అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కడపలో పనిచేసిన సమయంలో ఇలాంటి ఉదాహరణలెన్నో. ఆ దూకుడే ఆయనకు ‘కడప పులి’ అని పేరు తీసుకొచ్చింది.

పులివెందులలో ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయిన ఉమేశ్ చంద్ర… ఆ తర్వాత మళ్లీ వరంగల్ ఓఎస్జీగా బదిలీ అయ్యారు. అంతకుముందే నక్సలైట్లపై విరుచుకుపడ్డ ఉమేశ్ చంద్ర… ఈసారి దూకుడు మరింత పెంచారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ జపిస్తున్న ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ మంత్రాన్ని అప్పుడే అమలు చేశారు ఉమేశ్ చంద్ర. ప్రజల్లో ఉంటూ… ప్రజల సమస్యలు తెలుసుకుంటూ… వాటికి పరిష్కారాలు సూచించేవారు. అయితే అంతకుముందు సమస్యలతో నక్సలైట్లను కలిసే అలవాటున్న జనం… మెల్లిమెల్లిగా పోలీసులకు దగ్గరయ్యారు. దీంతో నక్సలైట్ల చుట్టూ ఉచ్చు బిగిసింది. చాలామంది నక్సలైట్లు జైలుపాలయ్యారు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది. డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ సాయంతో అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తోంది. కానీ ఉమేశ్ చంద్ర పనిచేసిన కాలంలో టెక్నాలజీ పెద్దగా లేదు. అయినా ఆ సమయంలో తను ఏర్పాటు చేసిన నెట్వర్క్ నక్సలైట్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. వరంగల్ ఓఎన్డీ తర్వాత తర్వాత ఉమేశ్ చంద్ర మరోసారి కడపకు బదిలీ అయ్యారు. ఈసారి జిల్లా ఎస్పీ హోదాలో వెళ్లారు. ఏఎస్పీగా ఉన్నప్పుడే ఫ్యాక్షనిస్టులకు నిద్రలేకుండా చేసిన ఉమేశ్ చంద్ర… ఎస్పీగా వెళ్లి అంతే కఠినంగా ఉన్నారు. రెండేళ్లు కడపలో ఎస్పీగా పనిచేసి

1997లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన బదిలీ ఆపాలంటూ జనం ధర్నాలు కూడా చేశారు. కారణం… ఉమేశ్ చంద్ర పోలీసాఫీసర్గా ఉన్నప్పుడే అక్కడి జనం స్వేచ్ఛ అంటే ఏంటో చూడగలగడమే. ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా, నిర్భయంగా ఫిర్యాదులు చేయగలిగారు ప్రజలు. అందుకే ఆయన బదిలీ అవుతున్నారంటే తట్టుకోలేకపోయారు. అక్కడ్నుంచి ఉమేశ్ చంద్ర బదిలీ అయిన కరీంనగర్ కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతమే. అక్కడ ఉమేశ్ చంద్ర విధుల్లో సఫలమయ్యారు. ఏడాదిపాటు కరీంనగర్ ఎస్పీగా పనిచేసిన తర్వాత డిప్యూటీ ఐజీగా ప్రమోషన్ వచ్చింది.

4 సెప్టెంబర్, 1999… పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేని రోజు. హైదరాబాద్ ఎస్సార్నగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఐపీఎస్ ఉమేశ్ చంద్రను నలుగురు నక్సలైట్లు దారుణంగా కాల్చారు. ఓవైపు బుల్లెట్ల గాయాలు విలవిల్లాడేలా చేస్తున్నా ఉమేశ్ చంద్ర మాత్రం తన విధిని మరవలేదు. గాయాలతోనే కారులోంచి దిగి నక్సలైట్లను తరిమారు. కానీ… ఉమేశ్ చంద్ర చేతిలో గన్ లేకపోవడంతో ఎదురుతిరగలేకపోయవారు. నక్సలైట్లు మళ్లీ కాల్పులు జరపడంతో ఉమేశ్ చంద్ర అక్కడే చనిపోయారు. ఉమేశ్ చంద్రతో పాటు ఆయన గన్మ్యాన్, డ్రైవర్ కూడా ప్రాణాలొదిలారు. పట్టపగలు… హైదరాబాద్ మహానగరంలో నడిరోడ్డుపై ఓ ఐపీఎస్ ఆఫీసర్ని నక్సలైట్లు కాల్చిచంపిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉమేశ్ చంద్ర కన్నుమూసిన ఎస్సార్నగర్ చౌరస్తాలోనే 2000 సెప్టెంబర్ 4న ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏ నక్సలిజాన్నైతే ఉమేశ్ చంద్ర రూపుమాపాలనుకున్నారో… ఆ నక్సలైట్లే ఆయన్ను బలితీసుకోవడం డిపార్ట్మెంట్కు పెద్ద దెబ్బ. కానీ ఆయన చేసిన త్యాగం పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఓ అధ్యాయం. అందుకే ఉమేశ్ చంద్ర చనిపోయి ఏళ్లు గడచినా ఆయన త్యాగాన్ని ఇప్పటికీ డిపార్ట్మెంట్ గుర్తుచేస్తూ ఉంటుంది. తెలంగాణలో నక్సలిజమైనా, రాయలసీమలో ఫ్యాక్షనిజం, రౌడీయిజం అయినా… ఉమేశ్ చంద్ర డీల్ చేసిన తీరు… ఈ తరం పోలీసులకు పాఠ్యాంశాలే.

కనిపించని నాలుగో సింహం పోలీస్ లాంటి డైలాగులు ఖాకీ చొక్కా హీరోయిజాన్ని సినిమా తెర పండించిన సీన్లు చాలానే చూశాం కానీ… ఉమేశ్ చంద్ర కెరీర్లో అలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయంటూ ఇప్పటికీ డిపార్ట్మెంట్లో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కథలుకథలుగా చెబుతుంటారు. యువ పోలీసులకు పాఠాలుగా బోధిస్తుంటారు. అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కాబట్టే ఉమేశ్ చంద్ర అంటే అభిమానించేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆ అభిమానం ఎంతవరకు వెళ్లిందంటే… ఉమేశ్ చంద్రను కీర్తిస్తూ ఏకంగా పాటలు రాశారు. పాడారు. అదీ అభిమానమంటే. విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, అంకితభావం లాంటి పదాలకు పర్యాయ పదం ఉమేశ్ చంద్ర అని కీర్తిస్తుంటారు. సినిమాల్లో పోలీస్ పాత్రలో కనిపించే హీరోయిజం… ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంటాయి కానీ… అవి కేవలం సినిమాల కోసం రాసుకున్న సీన్లు. అలాంటివి నిజజీవితంలో చూడాలంటే ఉమేశ్ చంద్రలాంటి ఐపీఎస్ల జీవిత చరిత్రలు తెలుసుకోవాలి. ఉమేశ్ చంద్ర అంటే… అమీర్పేట్, ఎస్సార్ నగర్ మధ్య ల్యాండ్ మార్క్ కాదు. అసాంఘిక శక్తుల గుండెల్లో ల్యాండై మైన్.