కిచకిచమనే నీ అరుపు..
పొద్దున్నే ప్రకృతి పిలుపు..
నిద్రలేస్తూనే అదోలాంటి
మైమరపు..
ఆ పులకింత..గిలిగింత
మాయమయే
మాయదారి కాలం..
కాలుష్యపు జాలం..
వింత పోకడల కలికాలం..!
పిచ్చుక..గుర్తుందా
నీ చిన్నప్పటి నేస్తం..
పుల్లాపుటకా ముక్కున కరచి
గూడును కట్టే దాని కష్టం..
చూడడం మనకెంత ఇష్టం..!
ఆకారంలో చిన్నదైనా
ఎంత ముచ్చటగా
కట్టుకుంది తన ప్రాకారం..
అక్కడా ఇక్కడా దొరికే
తినుబండారాలను
పిల్లల కోసం
మోసుకొచ్చే
తన మాతృహృదయ
మమకారం..
నీ లేతప్రాయపు
బ్రతుకుపాఠాల నుడికారం..!
పక్షుల కిలకిలారావాలు..
సుప్రభాత కిరణాలు..
మంచు కురిసే వేళలు..
ఏవి తల్లీ నిరుడు కురిసిన
హిమసమూహములు..
మాయమైపోతున్న జాతులు
మన చిన్ననాటి రీతులు..
అవిగో ఆవిగో..
నల్లని మబ్బులు
గుంపులు గుంపులు..
తెల్లని కొంగలు
బారులు బారులు..
వాటి నడుమ
పిచ్చుకల దారులు..
ఇలాంటి అందాలు..
వీడిపోని బంధాలు..
కాపాడుకుంటే
భావితరాలకు
మనమిచ్చే కానుక..
దూరమయ్యే ప్రకృతి కినుక..
ప్రకృతి ఆహ్లాదం..
వీడిపోని వినోదం..!