Politics

అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ..

అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ..

ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి అలజడి మొదలైంది. రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజధానిలో ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది..

మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని, జీవోను వ్యతిరేకిస్తూ అప్పట్లో రాజధాని రైతులు కోర్టుకు వెళ్లారు. కనీసం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మూకుమ్మడిగా రాజధాని రైతులు వ్యతిరేకించారు. అయినా, రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై గెజిట్‌ విడుదల చేసింది. పేద వర్గాల ఇళ్ల కోసం భూములు కేటాయిస్తున్నట్టు గెజిట్‌లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి కోర్టులో సవాలు చేసేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు.

ఏమిటీ ఆర్‌5 జోన్‌?

రాజధాని బృహత్‌ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్‌-1 (ప్రస్తుత గ్రామాలు), ఆర్‌-2 (తక్కువ సాంద్రత గృహాలు), ఆర్‌-3 (తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు), ఆర్‌-4 (హైడెన్సిటీ జోన్‌) పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి. అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.