అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర రుణ భారంలో ఉన్నాయని ఫిచ్ గ్రూప్‌నకు చెందిన క్రెడిట్ సైట్స్ కిందటేడాదే హెచ్చరించింది. గత సెప్టెంబర్ 30నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా.
- రూ.2.3 లక్షల కోట్ల రుణ భారంలో అదానీ గ్రూప్
- అయినా ఆగని ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు
- ఆప్తమిత్రుడికి మోదీ ఆర్థిక తోడ్పాటు
- ఎల్ఐసీ, బీవోబీ, ఐవోసీ, గెయిల్ ద్వారా భారీగా పెట్టుబడులు
- హిండెన్‌బర్గ్ వివాదం తర్వాత కూడా అంతే..
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర రుణ భారంలో ఉన్నాయని ఫిచ్ గ్రూప్‌నకు చెందిన క్రెడిట్ సైట్స్ కిందటేడాదే హెచ్చరించింది. గత సెప్టెంబర్ 30నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా. అయితే అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ, అదానీ కంపెనీల్లో ప్రభుత్వ రంగ సంస్థలు పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు వెలువడిన తర్వాత కూడా ఆయా సంస్థల ప్రతినిధులు అదానీ కంపెనీలను సమర్థిస్తూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతున్నది.
(స్సెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్‌లో ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) భారీగా పెట్టుబడులు పెట్టింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడక ముందువరకూ అదానీ కంపెనీల్లో ఎల్ఐసీకి ఉన్న పెట్టుబడుల విలువ రూ.87,380 కోట్లుగా ఉన్నది. ఏడాది క్రితం ఉన్న రూ.32,100 కోట్ల పెట్టుబడితో పోలిస్తే గత డిసెంబర్లో అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ వాటా మూడింతలైంది. దేశంలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అదానీ కంపెనీల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ కంటే ఎల్ఐసీ పెట్టుబడులు 4.9 రెట్లు అధికం.
అయితే రూ.2.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ ఇంతలా పెట్టుబడులు పెట్టడం.. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీరేట్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్లను విక్రయిస్తున్నా ఎల్ఐసీ అదానీ షేర్లను కొనుగోలు చేస్తుండటం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. నిజానికి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వాటి పోటీ వ్యాపార కంపెనీలతో పోలిస్తే అత్యధిక విలువపై ట్రేడవుతున్నప్పటికీ, ఎల్ఐసీ భారీగా పెట్టుబడులు పెట్టింది. ప్రభుత్వ రంగ పోటీ సంస్థలైన ఇంద్రప్రస్థ గ్యాస్, పవర్‌గ్రిడ్ షేర్లు తక్కువ విలువలకే లభించినప్పటికీ, ఎల్ఐసీ అదానీ గ్రూప్ షేర్లనే కొనడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.
మిగతా సంస్థలదీ అదే బాట
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎల్ఐసీనేగాక ప్రభుత్వ రంగానికే చెందిన మిగతా సంస్థలూ (పీఎస్‌యూ) అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాయి. 2017లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), గెయిల్ లిమిటెడ్ కంపెనీలు ఒడిశాలోని ధమ్రా పోర్ట్‌లో రూ.6 వేల కోట్ల విలువైన సహజ వాయువు టెర్మినల్‌లో 49 శాతం వాటా కోసం పెట్టుబడులు పెట్టాయి. ఈ టెర్మినల్ అదానీ ఎంటర్ప్రైజెస్ నియంత్రణలో ఉన్నది. అప్పటికే అదానీ గ్రూప్ పీకల్లోతు అప్పుల ఊబిలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులోగల సహజ వాయువు టెర్మినల్‌లో ఐవోసీ రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తద్వారా రుణభారం ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌నకు వివిధ కంపెనీల నుంచి అప్పులు పుట్టేలా సాయపడింది.
ఏమాత్రం ఢోకా లేదట
హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం.. అదానీ గ్రూప్‌లోని ఎల్ఐసీ షేర్ల విలువ ఆవిరై సగానికిపైగా సంపద కరిగిపోయింది. అయినప్పటికీ అదానీ గ్రూప్‌పై తమకు విశ్వాసం ఉందని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ చెప్పడం సర్వత్రా వివాదాస్పదమైంది. నిజానికి పెట్టుబడులు పెట్టిన ఏ సంస్థ అయినాసరే.. ఆ కంపెనీ నష్టాల్లోకి జారుకుంటుంటే సదరు ఇన్వెస్ట్మెంట్లను వెనక్కితీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎల్ఐసీ అలా చేయట్లేదు. పైగా మరింత నమ్మకం పెరిగిందని ఎల్ఐసీ అధిపతి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, అదానీ గ్రూప్‌లో తమ పెట్టుబడులకు ఢోకా లేదని బీవోబీ స్పష్టం చేయడం మరో విచిత్రం. అదానీ సంస్థలు కోరితే మరిన్ని పెట్టుబడులనూ పరిశీలిస్తామని ఆ బ్యాంక్ సీఈవో, ఎండీ సంజీవ్ చద్దా అన్నారు. అదానీ గ్రూప్‌నకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి విధానపరమైన అండదండలు దండిగా ఉన్నాయని పెద్దయెత్తున వార్తలు వస్తున్నాయి.