భద్రాచలం: రామయ్య దివ్య క్షేత్రం భద్రాచలంలో వసంతపక్ష పుష్కరోత్సవాలు బుధవారం ప్రారంభం కానుండగా.. వీటితో పాటు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు, ద్వాదశ కుండాత్మక శ్రీరామాయణ మహాక్రతువుకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. అయితే శోభకృత నామ సంవత్సర ఉగాది రోజైన బుధవారం ప్రారంభమమ్యే ఈ ఉత్సవాలు ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్నాయి. ఉగాదిరోజున పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభమవుతాయి. అలాగే శ్రీరామాయణ మహా క్రతువుకు అంకురార్పణ చేయనున్నారు. 26న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం, 27న ధ్వజపట భద్రుక మండల లేఖనం, 28న అగ్నిప్రతిష్ఠ ధ్వజారోహణం, 29న ఎదుర్కోలు సేవ, 30న శ్రీరామనవమిని పురస్కరించుకని శ్రీ సీతారాముల తిరుకల్యాణ మహోత్సవం, శ్రీరామ పునర్వసుదీక్ష ప్రారంభం కానుంది. 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం, శ్రీరామాయణ మహాక్రతువు పూర్ణాహుతి, ఏప్రిల్ ఒకటిన సదస్యం, రెండున తెప్పోత్సవం, చోరోత్సవం, 3న ఊంజల్ సేవ, 4న వసంతోత్సవం, 5న చక్రతీర్ధం, పూర్ణాహుతి, సార్వభౌమ సేవ, శేష వాహన సేవ, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షణలు, ద్వాదశ ఆరాధనలు, శ్రీ పుష్పయాగం నిర్వహించనుండటంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
భద్రాద్రి చరిత్రలో ఇది మూడోసారి
వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, శ్రీరామాయణ మహాక్రతువుకు ఒకేసారి శ్రీకారం చుట్టడం భద్రాద్రి చరిత్రలో మూడోసారని వైదిక సిబ్బంది తెలిపారు. 1987లో మహాసామ్రజ్య పట్టాభిషేకం సమయంలో తొలిసారి నిర్వహించారు. తరువాత 2011లో నిర్వహించారు. మళ్లీ ఈ సంవత్సరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి రెండు ప్రధాన ఉత్సవాలు ప్రారంభం కావడంతో భద్రాద్రిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.