ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆలయ క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 9.00 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సంప్రదాయబద్దంగా పంచాంగశ్రవణం జరిగింది. సాయంత్రం 5గంటలకు శ్రీశైలం పురవీధులలో స్వామిఅమ్మవార్లకు రథోత్సవం నిర్వహించనున్నారు. ఈరోజు రమావాణీసేవిత రాజరాజేశ్వరి అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 8:00 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ జరుగనుంది.