🔶ఏడాదంతా సందర్శకులకు అనుమతి..
🔷ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
హైదరాబాద్, బొల్లారం: రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా పేరొందిన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనకు సిద్ధమైంది. ఏడాదంతా తిలకించేందుకు వీలుగా అనుమతి కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాదిని పురస్కరించుకొని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె కార్యక్రమాన్ని ఆరంభించగా… గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ శాంతికుమారి రాష్ట్రపతి నిలయంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆహ్లాదాన్ని అనుభవించడంతోపాటు స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరుల త్యాగాలను ఈ తరం పిల్లలు, యువకులకు తెలిపేందుకు సందర్శన కార్యక్రమానికి అనుమతి ఇచ్చామన్నారు. అనంతరం ఆమె జైహింద్ ర్యాంప్, జాతీయ పతాక పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
🌀రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు వచ్చే వారికి అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆర్ట్ గ్యాలరీ, కోర్ట్‌యార్డ్ ప్రాంతాలను నవీకరించింది. గతంలో ఏడాదికి 15 రోజులు మాత్రమే సందర్శనకు అనుమతి ఉండగా.. మార్చి 23 నుంచి సోమవారాలు, సెలవు రోజులు మినహా ఏడాదిలో మిగతా అన్ని రోజుల్లోనూ సందర్శించొచ్చు. http://visit.rashtra pathibhavan.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. భారతీయులకు రూ.50, విదేశీయులకు రూ.250గా ధర నిర్ణయించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.