🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿అనగనగా అడవిలో ఓ కోకిల ఉండేది. అది ఒక రోజు ఓ ఇంటి పెరట్లోని చెట్టుపై వాలింది. కూహు కూహు అని రాగాలు పలికింది. తనను అందరూ గమనిస్తున్నారా లేదా అని చూడసాగింది.
🌸అంతలో ఆ ఇంటి ముందు ఓ పావురం తిరుగుతూ కనిపించింది. అది ఆ ఇంటి వారి పెంపుడు పావురంలా ఉందని గ్రహించింది కోకిల. వాళ్లు దానికి గింజలు వేస్తూ ప్రేమగా చూసుకోవడం చూసి కోకిలకు ఆసూయ కలిగింది.
🌿 ఇంటి యజమాని, పిల్లలు వెళ్లగానే పావురం ముందు వాలింది. గొంతెత్తి మెల్లగా పాడింది. పావురం మెచ్చుకోలుగా స్నేహంగా చూసింది. అప్పుడు కోకిల ఇలా బడాయిలు పోయింది. ‘
🌸కొన్ని తరాల ముందు మేమూ మీలానే తెల్లగా, అందంగా ఉండేవాళ్లం. ఎండలో తిరిగి నల్లగా మారాం. అయినా మేం అందం కంటే ఇతరులను సంతోషపెట్టడమే ముఖ్యం అనుకున్నాం.
🌿లేకుంటే మీకంటే మేమూ అందంగా ఉండేవాళ్లం’ అంది. కోకిల మాటలు విన్న పావురం జవాబు చెప్పేలోగా యజమాని వచ్చి పావురం కాలికి చీటి కట్టి పక్క ఊరికి వెళ్లమని చెప్పాడు. అది చూసి కోకిల ‘ఓ మనిషి, నన్ను కూడా పెంచుకో మంచిగా పాడతాను, దీనిలా ఉత్తరాలు తీసుకెళతాను’ అంది. దానికి యజమాని నవ్వాడు.
🌸దాంతో ‘ఎందుకు నవ్వుతున్నావు? నేను నల్లగా ఉన్నాననే కదా!’ అని అంది కోకిల. యజమాని శాంతంగా ‘కోకిలమ్మా! నువ్వు అందంగా లేవని కాదు. నువ్వు పాటలు బాగా పాడతావు. అది విని మేము సంతోషిస్తాం. కానీ నువ్వు గుడ్లు పెట్టాక పొదగకుండా నీ పిల్లల్ని కాకి గూట్ల్లో వదులుతావు.
🌿నీ పనే నువ్వే చేసుకోలేవు. ఇక మా పని ఎలా చేస్తావు?’ అని అన్నాడు యజమాని. దాంతో కోకిల సిగ్గుతో ‘ బడాయిలు చెప్తూ అత్యాశకు పోతే ఇంతే’ అనుకుంటూ ఎగిరిపోయింది…🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿