NRI-NRT

భారత్కు భారతీయ అమెరికన్ల మద్దతు.. ‘మీరు మా సోదరులు.. రండి మాతో కలవండి’

భారత్కు భారతీయ అమెరికన్ల మద్దతు.. ‘మీరు మా సోదరులు.. రండి మాతో కలవండి’

అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో (San Francisco) ఉండే ఇండియన్​ కాన్సులేట్‌పై (Indian Consulate) ఖలిస్థానీ మద్దతుదారులు (Khalistan Supporters) గత ఆదివారం రాత్రి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

వాషింగ్టన్: అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో (San Francisco) ఉండే ఇండియన్​ కాన్సులేట్‌పై (Indian Consulate) ఖలిస్థానీ మద్దతుదారులు (Khalistan Supporters) గత ఆదివారం రాత్రి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ బారికేడ్లను దాటుకుని.. ఖలిస్థాన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ పలువురు ఇండియన్​ కాన్సులేట్‌ కార్యాలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. రాడ్లు, కర్రలతో బిల్డింగ్ తలుపులు, కిటికీలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా కాన్సులేట్​ఆవరణలో రెండు ఖలిస్థానీ జెండాలను కూడా ఎగరేశారు. అయితే, ఆ జెండాలను ఆఫీస్ సిబ్బంది వెంటనే తొలగించారు. ఇక ఈ దాడిని భారతీయ అమెరికన్లు (Indian Americans) తీవ్రంగా ఖండించారు. కాన్సులేట్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఖలిస్థాన్ మద్దతుదారులు చేసిన నిరసనను వ్యతిరేకిస్తూ.. భారతీయ అమెరికన్లు భారత్‌కు మద్దతు తెలిపారు. కాన్సులేట్ వద్ద జాతీయ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. భారీ సంఖ్యలో భారతీయులు రావడంతో అక్కడున్న పలువురు ఖలిస్థానీ మద్దతుదార్లు వెనక్కి తగ్గారు. ‘మీరు మా సోదరులు.. రండి మాతో కలవండి’ అంటూ ఖలిస్తానీ మద్దతుదారులను కోరారు.

కాగా, ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ డే’ (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు సెర్చ్ చేస్తుండడం, ఆయన మద్దతుదారులను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఖలిస్థానీ మద్దతుదారులు బ్రిటన్, కెనడా, అమెరికాలోని భారత కార్యాలయాల వద్ద నిరసనకు దిగుతున్నారు. ఇక వారం రోజుల నుంచి పంజాబ్ పోలీసుల కంటికి చిక్కకుండా అమృత్‌పాల్ సింగ్ చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన లీలలు చాలా ఉన్నాయని పోలీసులు చెప్పారు. తనకంటూ ఓ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ప్రత్యేకంగా కరెన్సీని రూపొందించుకున్నారని అంటున్నారు. ఖలిస్థాన్ దేశం కోసం ప్రత్యేకంగా ఓ జెండాను కూడా రూపొందించారని తెలిపారు.