అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తెలుగు భాషా-సంస్కృతుల పరివ్యాప్తిలో ముందు వరుసలో ఉన్న సిలికానాంధ్ర సంస్థ 2017లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని (University of Silicon Andhra – https://uofsa.edu/) ఏర్పాటు చేసి పలు విభాగాల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో శనివారం నాడు నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో పద్మశ్రీ-పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు, హిందీ-తెలుగు భాషల్లో PhD పట్టభద్రులు, రెండు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత, ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేరిట ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
తన సేకరణలో సేదతీరిన 14,500కు పైగా పుస్తకాలు, సంపుటాలు, గ్రంథాలను యార్లగడ్డ ఈ గ్రంథాలయానికి వితరణగా అందజేశారు. వీటితో పాటు భారత ప్రభుత్వం అందజేసిన పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను, ధ్రువపత్రాలను ఈ గ్రంథాలయంలో ప్రదర్శన నిమిత్తం అందజేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ గ్రంథాలయ ఏర్పాటు నిమిత్తం $40వేల డాలర్లు వితరణగా అందజేశారు. వీరి విరాళాలతో విశ్వవిద్యాలయ తెలుగు సుగంధలు మరింత పరిమళభరితమయ్యాయని సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, సిలికానాంధ్ర నిర్వాహకులు దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, SFO భారత కాన్సులేట్ కాన్సుల్ జనరల్ డా.టీ.వీ.నాగేంద్ర ప్రసాద్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.
*** వెంకయ్య హర్షం
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తన ఆత్మీయ మిత్రుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేరిట గ్రంథాలయ ఏర్పాటు పట్ల మాజీ ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హర్షం వెలిబుచ్చారు. ఇది యార్లగడ్డకే గాక, ప్రవాస తెలుగువారికి, భాషాప్రేమికులకు మరపురాని రోజని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తాను పాల్గొనవల్సి ఉందని, ఆరోగ్య కారణాల రీత్యా రాలేకపోయాయని వెంకయ్య తెలిపారు.