Politics

గిద్దలూరు ఎమ్మెల్యే తీరుపై వైకాపాలో అనుమానాలు…

గిద్దలూరు ఎమ్మెల్యే తీరుపై వైకాపాలో అనుమానాలు…

మరో అసంతృప్తి వైసిపి ఎమ్మెల్యే తన స్వరం..

అమరావతి : ఏపీలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీకి అసంతృప్త ఎమ్మెల్యేలు వరుస షాకులిస్తున్నారు. ఒక్కొక్కరిగా తమ అసంతృప్త స్వరాలను బయటపెడుతున్నారు.

మరో ఏడాది కాలం ఉన్న పదవికి ముప్పు ఉంటుందని తెలిసినా అసంతృప్తిని మాత్రం సందర్భాన్ని బట్టి బయటపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే తమ అసంతృప్తి బయటపెట్టేందుకే సందర్భాలు వెతుక్కుంటున్నట్లు కనిపిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ఏమాత్రం ఆలోచించకుండా 24 గంటల్లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్.. ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలకు స్పష్టమైన సంకేతాలు పంపారు. తోక జాడిస్తే వేటు తప్పదని జగన్ పంపిన హెచ్చరికలు పార్టీలో అసంతృప్త ఎమ్మెల్యేల్ని ఆలోచనలో పడేయడం ఖాయమని అంతా భావించారు. కానీ మరో అసంతృప్త ఎమ్మెల్యే తన స్వరం వినిపించారు. ఓ సందర్భాన్ని వెతుక్కుని మరీ ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అక్కడ అధికారులు తనకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం కల్పించి తన భార్యకు జనరల్ బ్రేక్ దర్శనం మాత్రమే ఇప్పించడంపై ఫైర్ అయ్యారు. స్వయంగా సీఎంవోలో కీలక అధికారి ధనుంజయరెడ్డి నుంచి సిఫార్సు లేఖ తెచ్చుకున్నా టీటీడీ అధికారులు లెక్కచేయకపోవడంపై అన్నా రాంబాబు భగ్గుమన్నారు. తాను దర్శనం చేసుకున్న సమయంలో 200 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాని వారు ప్రోటోకాల్ దర్శనం చేసుకుని వెళ్లారని సంచలన ఆరోపణలు చేశారు.

దీనిపై టీడీడీ స్పందించింది. ఎమ్మెల్యేతో పాటు 10 మందికి, సీఎంవో నుంచి మరో 10 మందికి, టీటీడీ ఛైర్మన్ ఆఫీసు నుంచి ఇంకో 10 మందికి ప్రోటోకాల్ దర్శనం సిఫార్సులు తెచ్చుకున్నారని వెల్లడించింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు 10మందికి ప్రోటోకాల్ దర్శనం కల్పించామని, మిగిలిన వారికి మాత్రం జనరల్ బ్రేక్ దర్శనం మాత్రమే కల్పించినట్లు వివరణ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే వైసీపీలో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న అన్నా రాంబాబు తన అసంతృప్తిని బయటపెట్టుకునేందుకు ప్రోటోకాల్ దర్శనం వ్యవహారాన్ని వాడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.