తరచూ వార్తల్లో నిలిచే ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మళ్లీ వార్తల్లో నిలిచారు.మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ప్రసిద్ధ నూకాలమ్మ జాతరకు ముందు ఆదివారం అనకాపల్లిలోని ప్రసిద్ధ నూకాలమ్మ ఆలయాన్ని మంత్రి అమర్‌నాథ్ సందర్శించారు.మంత్రి అమర్‌నాథ్ పర్యటన సందర్భంగా ఆలయంలో అనుహ్యకరమైన అనుభవం ఎదురైంది.
విరామ సమయంలో మంత్రి అమర్‌నాథ్ రావడంతో నూకలమ్మ దర్శనం కోసం 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని సమాచారం.ఆచారాలలో భాగంగా, నైవేద్యం సమయంలో,అమ్మవారి దర్శనం అందరికీ నిలిపివేయబడుతుంది.దర్శన సమయాలను ముందుగానే తనకు తెలియజేయకపోవడంతో మంత్రి అమర్ నాథ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
దీంతో ఆగ్రహం చెందిన మంత్రి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు అధికారులపై ఎండోమెంట్ శాఖ చర్యలు తీసుకుని బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.ఇంచార్జి అధికారి బుద్దా నగేష్,నూకాలమ్మ ఆలయ కార్యదర్శి చంద్రశేఖర్ బదిలీ అయ్యారు.అనకాపల్లి జిల్లా ఎండోమెంట్ ఇంచార్జిగా సూపరింటెండెంట్ ఎస్ రాజారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. విశాఖ వైభవ వేంకటేశ్వర ఆలయ ఈఓ బండారు ప్రసాద్‌కు నూకాలమ్మ ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.