నాగరకత పెరిగే్కొద్దీ జీవిత విధానానికి సంబంధించిన వ్యాధులు (లైఫ్ స్టయిల్ డిజార్డర్స్) పెరుగుతాయి. నాగరిక భోజనాన్ని
“గ్రామ్యాహారం” అంటారు. గ్రామ్య(నాగరిక) జీవన విధానాలన్నీ ప్రకృతి సహజమైన అంశాలకు శత్రువులే! తెలిసి చేసే తప్పుల్ని ప్రఙ్ఞాపరాధా లంటారు. మన అపరాధాల వలనే భూతాపం పెరుగుతోంది, అందుకు నివారణ చర్యలు మనమే తీసుకొవాలి. వేసవి ధాటికి చలవసూత్రాలు మనమే వెదకాలి.
ఏ ఋతువులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ఋతుచర్య. ఆహారపరంగా, విహారపరంగా రెండు విధాలుగా ఋతుచర్యలు (dietary and behavioural regimens) ఉంటాయి. బైట వాతావరణంలోనూ, లోపల శరీరంలోనూ కలిగే మార్పుల్ని సమానం చేసేది ఋతుచర్య. అందువలన రోగాలు తెచ్చే దోషాలు ఆగుతాయి. ఏ రుతువుకైనా ఇదే సూత్రం.
వేసవిలో ఏం జరుగుతుంది?
భూమి లోపల్నించి, ప్రకృతి నుంచి, శరీరంలోంచి, సౌమ్యత్వాన్ని (moist, soft, gentle గుణాల్ని)వేసవి గ్రహించటం వలన సమస్త సృష్టి నీరసిస్తుంది. చేదు, వగరు, కారం రుచులు బలపడతాయి. శరీరం బలహీనపడ్తుంది. కఫం తక్కువగా, వాతం మధ్యస్థంగా ఉంటాయి. శరీరబలం, జాఠరాగ్నిబలం క్షీణిస్తాయి. కాలే పెనంలా భూమి వేడెక్కుతుంది. నదీప్రవాహాలు మందగిస్తాయి. జలధాతువు తగ్గి శరీరం వడలి, నీటికోసం తపన పెరుగుతుంది. ప్రకృతి కృశిస్తుంది. ఆకుల్లేక చెట్లు బట్టల్లేని బికారు లౌతాయి. వేసవిలో దేహం కోసమే కాదు, దేశం కోసం కూడా నీటి నిల్వలను పరిరక్షించుకోవాలి.
లైఫ్ స్టైల్ మార్చే సూత్రాలు
ఏ.సీ. రూములు సహకరిస్తాయనుకుంటాం గాని తోటల్లో చెట్లకింద గడిపేవారికి అందేటంత ప్రాణవాయువు, కలిగేటంత ఉపశాంతి ఏసీల వలన రావు. రాత్రిపూట ఆరుబయట పడుకోవటం వలన కలిగే సుఖం ఏసీలో ఉండదు. ఎండ, గాలి, వెల్తురు రాని ఇళ్లలో ఉంటే వేసవిలో ఇబ్బందే! ఏ ఇంట్లో పగలు లైటు వేయాల్సి వస్తోందో ఆ ఇంట్లో రోగులు రోగాలూ ఎక్కువే! గాలి ధారాళంగా వీచే ఇంట్లో వడగొట్టదు.
భోజనానికి నిద్రకు వేళాపాళా అవసరం. రాత్రి జాగరణలు శరీరాన్ని బలహీన పరుస్తాయి. తేలికగా వడదెబ్బ తగుల్తుంది. వేసవిలో సూటూ బూటూ సఫారీలకు బదులు తెల్లని పలుచని వదులు నూలుదుస్తులు తొడుక్కోండి. ముప్పొద్దులా స్నానం చేస్తూ, శరీరాన్ని సాధ్యమైనంత చల్లబరుస్తూ ఉండండి. అతివ్యాయామం (శరీర శ్రమ), వ్యవాయం (అతిసెక్సు), వ్యసనాలు( మద్యపానాదులు) వేసవి కష్టాల్ని పెంచుతాయి. తడిచీరలు ఇంటి చుట్టూ ఆరేస్తే ఇంటిలోపల వాతావరణం చల్లగా ఉంటుంది. వడదెబ్బ తగిలినవారు తామరాకులు, అరిటాకుల పక్క మీద పడుకుంటే ఒంట్లో వేడిని లాగేస్తుంది. మల్లెపూలు, చేమంతులు చలవనిస్తాయి.
అతిగా పులుపు, అతిగా కారం, అతిగా ఉప్పు వేసవిలో ఇబ్బంది పెడతాయి. ఉప్పుడు రవ్వ, బొంబాయి రవ్వ, మైదాలతో తయారైన వంటకాలు, పూరీ, మైసూరుబజ్జీ, మిరప బజ్జీలు, మసాలాలు, చింతపండు రసాలు,ఛాట్ మసాలాలు వేసవిలో హాని చేస్తాయి.
పులవబెట్టిన ఆహారపదార్థాలు కూడా వేసవికి శత్రువులే! మద్యం పులియబెట్టే పానీయమే కాబట్టి, వేసవిలో హానికరం. అది సమ్మర్లో కూలింగ్ ఇస్తుందనేది భ్రమ. కడుపులో ఎసిడీటీ పెంచుతుంది. ధూమపానమూ ఇంతే! మద్యం, కూల్‘డ్రింకులు, కాఫీ టీలు, ఐస్ క్రీములు, ఎక్కువ తీపి కలిసే బజారు పానీయాలు తాగేప్పుడు మజాగానే ఉంటాయి. కానీ, అతిగా మూత్రాన్ని నడిపించి శరీరలో నీటి ధాతువును తగ్గిస్తాయి. అందువలన త్వరగా వడకొట్తుంది. సాఫ్ట్‘డ్రింకుల వలన ఫాస్ఫరస్ ఎక్కువై ఎముకల్లోంచి కేల్షియం కణాలు విడిపోయి రక్తంలో చేరతాయి. రక్తంలో కేల్షియం పెరిగి ఎముకల్లో తగ్గిపోయి కీళ్లవాతం వస్తుంది.
మినరల్స్, ఎంజైములు చాలినంత లేక జీర్ణశక్తి పడిపోతుంది. శరీరంలో ఉత్పన్నమయ్యే వేడిని బయటకు పంపే మార్గాలు (స్రోతస్సులు-channels) మూసుకుపోయి ఒంట్లో వేడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. స్త్రీ బాల వృద్ధులకు వేసవిలో పగటి పూట కాసేపు నడుంవాల్చి కునుకు తీస్తే అలసట తీర్తుంది. మనం యుక్తిగా మన ఆహార విహారాల్ని సరిచేసుకుంటే వేసవిని గట్టెక్కేస్తాం.
పిల్లల కోసం చలవ సూత్రాలు
వేసవి కాలంలొ పిల్లలు ఉత్సాహంగా అడుకుంటున్నారు కదా అని వదిలేయకండి. వాళ్లకి చాలినంత ద్రవపదార్థాలిచ్చి శోష రాకుండా చూడండి. ఎండెక్కాక పిల్లలు రోడ్డెక్కకుండా కట్టడి చేయండి. ఒంటిపూట బళ్ళ పేరుతో మధ్యాహ్న భానుడు మలమల మాడ్చే సమయంలో పిల్లల్ని ఇంటికి పంపే విద్యావిధానం మనది. మనం దేశాన్ని మార్చలేం కాబట్టి, మనమే మారదాం. గుడ్డటోపి లేదా గొడుగు తప్పనిసరిగా పిల్లలకు అలవాటు చేయండి. బడి నుండి ఇంటికి వచ్చేప్పుడు త్రాగేందుకు ORS పానీయాన్ని తయారు చేసి ప్లాస్కులో పోసి పిల్లలకు ఇచ్చి పంపండి. ఒక గ్లాసు మజ్జిగలో ఒకనిమ్మకాయ రసమూ, చిటికెడంత సైంధవ లవణము, చెంచాడు పంచదార, చిటికెడంత తినే సోడా ఉప్పు(soda bicarb) వీటిని కలిపితే ఇదే గొప్ప ORS పానీయం. ఎండలోకి వెళ్లబోయే ముందు, ఎండలోంచి రాగానే త్రాగితే నిస్సందేహంగా వడకొట్టదు.
పిల్లలు మూత్రానికి వెళ్ళి ఎంత సేపైందో అడిగి తెలుసుకోండి. ఇంటికి రాగానే కొద్ది నిమిషాలు ఫ్యాను కింద కూర్చోబెట్టి కాళ్ళు, చేతులు, ముఖం కడిగి, మూత్రం అయితే పిల్లలకు వడగొట్టలేదని అర్థం.
వేసవి వెళ్లేవరకూ పిల్లలకు బయట తిళ్ళు ఆపండి. ఎండల వలన ఆహార పదార్థాలు త్వరగా పాడౌతాయి. అవి నిలవుండేందుకు ప్రిజర్వేటివులు, రంగురసాయనాలు, విషపరిమళాలు కలిపే ప్రమాదం ఉంటుంది. వేసవిలో బాక్టీరియాల విజృంభణ కూడా ఎక్కువే! కాబట్టి, కామెర్ల లాంటి జబ్బులు త్వరగా సోకుతాయి. చెమట ఎక్కువగా పట్టటం వలన చంకల్లోనూ, గజ్జల్లోనూ, ఫంగస్ పెరిగే అవకాశం ఉంది.
వ్యక్తిగత పరిశుభ్రత అవసరం. చాలామంది ఇళ్ళలో ఇప్పుడు గంధం చెక్క, దాన్ని అరగదీసే సానలు ఉండట్లేదు. అవన్నీ అనాగరికం అనేది వీరి అభిప్రాయం. నమ్మకమైన గంధంచెక్కని సానమీద అరగదీసి ఆ గంధాన్ని ముఖానికి, చేతులకు, చంకలకు, చెస్ట్ మీద, వీపుమీద రాస్తే చర్మం పేలకుండా ఉంటుంది. వేసవి వలన శరీరంలో దోషాలు పెరక్కుండా శమిస్తాయి.
శరీరానికి చాలినంత నీరు ఇవ్వండి
ఎంత నీరు తాగాము? ఎంత నీరు చెమట ద్వారా బయటకు పోయింది? దాహం వేసిందా? ఎక్కువ శ్రమ పడ్డామా? ఇలాంటి మీమాంస లేకుండా ఇంట్లోనే ఉన్నాసరే మాటిమాటికీ నీరు త్రాగుతూ ఉండండి. నీళ్ళెక్కువగా త్రాగితే కడుపు నిండిపోయి ఆకల్లేదంటూ ఉంటారు. ఇది నిజంకాదు. వేసవిలో సహజంగానే ఆకలి తక్కువ. అందుకని ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవటమే మంచిది. తేలికగా అరిగే పదార్థాలు, కూర ఎక్కువగా అన్నం తక్కువగా తినాలి.
మంచి నీరడిగితే మజ్జిగ ఇచ్చే సంస్కృతి మనది. కొంచెం దాహం పుచ్చుకోండంటే, ఈ చెంబుడు మజ్జిగ త్రాగండి అని అర్థం. అలా
వేసవిలో మజ్జిగ తాగాలి. వేసవికి విరుగుడు మజ్జిగే! పండ్లు, పండ్లరసాలు చాలినన్ని తీసుకోవాలి. కేరెట్, కీరదోస, ముల్లంగి ఈ మూడింటి జ్యూస్ ఇంటిల్లిపాదీ తలా ఒక గ్లాసు త్రాగుతుంటే సమ్మర్లో కుటుంబం సేఫ్. మొలకెత్తిన విత్తనాలు, బీన్స్, జీడిపప్పు, బాదాం లాంటివి ఉదయం పూట అనుకూలంగా ఉంటాయి.
రసాల లేదా శిఖరిణి అని పిలిచే ‘స్వీట్ లస్సీ’ మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయాల్లో తీసుకోండి. కొంచెం తీపి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పులుపు కలిసిన పానీయాలు, పానకాలు మంచివి ఈ కాలంలో. పండ్లరసాలు(షాడవాలు) సాయంత్రం పూట త్రాగటానికిఅనువుగా ఉంటాయి. సిట్రస్ పండ్లరసాలు వేసవిలో మంచి చేస్తాయి. చల్లని ద్రవపదార్థాలు మంచివే! కానీ, ఐసు ముక్కలు కలిపినవి బజార్లో కొని తాగకండి. ఆ ఐస్, శవాల్ని నిలవుంచేందుకు తయారైందేమో తెలీదు. పరిశుభ్ర జలాలతో తయారైన ఐసే వాడాలి.
ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క లేదా సోంపు పొడిని నీళ్లలో కొద్దిగా వేసి మరగకాచి, చల్లార్చి కుండలో పోసుకోండి. పచ్చి మంచినీళ్లకు బదులుగా ధనియావాటర్, జీరావాటర్, దాల్చినివాటర్ ఇవి తాగుతుంటే వడకొట్టదు.
చెరకురసం, కొబ్బరి నీళ్లు, వడపిందెలు (వేడికి రాలిపడిన లేతమామిడి పిందెలు), తాటిముంజెలు, మూడురెట్లు నీరు చేర్చి, శొంఠిపొడి, ఉప్పు కలిపిన మజ్జిగ వడదెబ్బకు విరుగుళ్లే!
క్యారెట్, క్యాబేజీ, టమోటా, అల్లం, కొత్తిమీర, పుదీనాలను సమానంగా తీసుకుని, తగినంత పెరుగు, ఉప్పు, మిరియాలు కలిపి మిక్సీ పడితే చిక్కటి మజ్జిగ వస్తాయి. ఇవి వడదెబ్బ తగలకుండా శరీరాన్ని కాపాడతాయి. పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, చక్కెర, నిమ్మరసం తగినన్ని నీళ్లు కలిపి మిక్సీ పట్టి వడకట్టిన పానీయం వడదెబ్బ తగలనీయదు.
మజ్జిగ లేదా పెరుగు మీద తేట తీసుకుని అందులో తేనె, నెయ్యి, చక్కెర, యాలకులపొడి తగినంత కలిపి తాగితే చలవ.
నీళ్లలో నానించిన సబ్జా గింజలు, బార్లీ జావ, సగ్గుబియ్యంజావ చలవ ద్రవ్యాల్లో చాలా ప్రముఖమైనవి.
వేసవిలో ఆహార సూత్రాలు
వేసవిలో పప్పుధాన్యాలు మేలు చేస్తాయి. తేలిగ్గా అరుగుతాయి. తక్షణశక్తిదాయకాలు. కందికట్టు, పెసరకట్టు (చింతపండు వెయ్యకుండా కాచిన పప్పుచారు)లాంటివి వేసవిలో చలవనిచ్చి, తక్షణశక్తిదాయకంగా ఉంటాయి. మాంసంకన్నా మాంసంతో సూపు (మాంసరసం) ఈ కాలంలో మంచిది. నెయ్యి వేసుకుని పప్పన్నం తింటే వేసవి ధాటికి శరీరం తట్టుకుంటుంది.
పొద్దున్నే ఎండెక్కక మునుపే స్నానం చేసి రాగిముద్ద, బార్లీముద్ద, జొన్నల్లాంటి చిరుధాన్యాల్తో కాచిన చిక్కని జావ లేదా పారిడ్జి (అంబలి) శరీరానికి ద్రవత్వాన్నిస్తాయి. ఆరికలు, బియ్యపురవ్వ, జొన్నరవ్వ, రాగి- వీటితో ఉప్మా, ఇడ్లీలు మేలు చేస్తాయి.
మసాలాకూరలు, పులుసుకూరలు, పులిహార, బిరియాని, పలావులు వేసవిలో హాని చేస్తాయి. ఫ్రీజ్జులో ఉంచిన పదార్ధాలు కొంత చల్లదనం ఇచ్చినా, చివరికి అవి శరీరంలో వేడినే పెంచుతాయి.
పుచ్చకాయ, కరుబూజా, తియ్యమామిడిపండ్లు, దానిమ్మ, సపోటా, ద్రాక్ష, మొలకెత్తిన విత్తనాలు ఇవి వేడిని తగ్గిస్తాయి. కీరా, చిలకడ దుంప, మెంతికూర, పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తరచూ వండుకుని తినాలి. తీపి పదార్ధాలు, తేలికగా అరిగే కూరగాయలు, ఆకుకూరలు వండుకోవాలి. పులుపు లేని కూరగాయలు ఆకుకూరలన్నీ చలవ నిచ్చేవే! వాటిని మసాలాలు, చింతపండు రసాలు దట్టించి వేడి చేసేవిగా మార్చి తినకూడదు.
రాత్రి పడుకునేప్పుడు అన్నం మునిగే దాకా ‘చల్ల’ పోసి ఉదయాన్నే ఆ అన్నాన్ని తిన్నా, పిసికి రసం తీసి త్రాగినా చలవ చేస్తుంది. వడకొట్టదు. స్థూలకాయం తగ్గేందుకు కూడా ఇది మంచి ఉపాయం.
మంచిగంథం చెక్కని సానమీద అరగదీసి తేనె కలిపి బఠాణీ గింజలంత మాత్రలు కట్టి నీడన ఆరనిచ్చి ఓ సీసాలో భద్రపరచుకోండి. ఒకటి నుండి రెండు మాత్రలు రెండు పూటలు వేసుకుంటూ ఉంటే వేసవి సుఖంగా గడిచిపోతుంది.
సితోపలాదిచూర్ణం ఒక చెంచా పొడి, గ్లాసుపాలలో వేసుకుని రోజూ పడుకోబోయే ముందు తాగితే అలసట తీరి సుఖనిద్ర పడ్తుంది.
ఇంతా చెప్పి ఆవకాయ గురించి చెప్పకపోతే ఈ వ్యాసం ఆ మహావంటకానికి అన్యాయం చేసినట్టే అవుతుంది. ఆవకాయ, మాగాయల్ని పెట్టిన తరువాత గాలి తగలకుండా జాడీల్ని గుడ్డతో సీలుచేసి మూడు నాలుగు నెలలపాటు మాగబెట్తే దాని అసలు రుచి తెలుస్తుంది. ఈ లోగా వేసవి వెళ్ళి వానాకాలం వచ్చేస్తుంది. ఊరుగాయలు తినవలసింది వానాకాలంలోనే కాని, వేసవిలో కాదు. కాలం కాని కాలంలో కమ్మని ఆవకాయ తిని ఇబ్బంది పడకూడదు.