తెలంగాణతో పాటు ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్
శివశంకర్ రెడ్డికి బెయిల్, అవినాష్ రెడ్డి కి జైలు ను తప్పించే ప్రయత్నాల కోసమే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్
రోజు రోజుకి ఒకే కోర్టులో తీర్పు మారుతోంది
కోర్టు ఇచ్చిన తీర్పులో ఏది కరెక్ట్
చట్టానికి అతీతంగా న్యాయస్థానం తీర్పు చెప్పవచ్చా?
15 రోజుల్లోనే కేసు విచారణ పూర్తి చేస్తామంటున్న సీబీఐ.
నిందితుడి భార్య వేసిన పిటిషన్ స్వీకరించి, ఆమె కోరినట్టుగా విచారణ అధికారిని మార్చాలనడం ఆశ్చర్యం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరే అవకాశం ఉంది. పడిపోతున్న పార్టీ గ్రాఫ్ ను చూసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ప్రత్యేక హోదా సాధన కోసం, పోలవరం పెండింగ్ బిల్లుల కోసమేనని పైకి చెబుతున్నప్పటికీ, ఆయన పర్యటనకు వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోందని అన్నారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం, కడప ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లకుండా కాపాడడం కోసమే ఆయన ఢిల్లీ పర్యటన చేపడుతున్నారన్నారు . అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లిన అంతిమ విచారణ పైకి రాకుండా చూసుకోవాలని కేంద్ర పెద్దలను కోరే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ పడిపోతున్న దృష్ట్యా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోన్న జగన్మోహన్ రెడ్డి, ఆ దిశగా సహకరించాలని కేంద్ర పెద్దలను కోరే అవకాశం ఉంది. గవర్నర్ ను కలిసిన వెంటనే ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లభించడం ఆశ్చర్యకరంగా ఉంది. కేబినెట్ విస్తరణ కోసం గవర్నర్ ను జగన్మోహన్ రెడ్డి కలిశారు. మంత్రివర్గంలో మాజీ మంత్రి నాని లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండడంతో, ఆయన్ని తిరిగి క్యాబినెట్లో కి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కేబినెట్ లోకి మాజీ మంత్రిని తిరిగి తీసుకుంటున్నట్లు కేంద్ర పెద్దలకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వెనుక, తాను అనుకుంటున్న వారిని అరెస్టు చేసి ఆనందించాలని ఆయన భావిస్తున్నారు. దానికి కేంద్రం కన్సెంట్ కోసమే ఢిల్లీ పర్యటన అని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అరెస్టులకు కేంద్రం నుంచి అనుమతి అవసరం లేకపోయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం పెండింగ్ బిల్లుల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అన్నది శుద్ధ అబద్ధం. ఈ మూడు కారణాలలో ఒకటి నిజమని రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు.
తలచినదే జరిగినదా దైవం ఎందులకు… అన్నట్టుగా జగన్ పరిస్థితి
తలచినదే జరిగినదా దైవం ఎందులకు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాడుకోవలసిన పరిస్థితి నెలకొందని రఘు రామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు. సుప్రీంకోర్టులో ఆయన కోరుకున్నది జరగలేదు. దేశంలోనే ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరైన కేకే వేణుగోపాల్ చేత వాదనలు వినిపించినప్పటికీ, జూన్ 16వ తేదీన తన రిటైర్మెంట్ ఉన్నదని పేర్కొన్న న్యాయమూర్తి, రాజధాని కేసును జూలై 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు తీర్పు రాకముందే, రాష్ట్ర ప్రభుత్వం బిల్లుని వెనక్కి తీసుకోవడం జరిగిందని, దానితో ఆ తీర్పుకు అర్థమే లేదన్న కేకే వేణుగోపాల్, హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చి, ఏప్రిల్ 11వ తేదీన సావధానంగా వాదనలు వినాలని కోరారు. ఆలోగా విశాఖపట్నం మకాం మార్చవచ్చు అన్నది ముఖ్యమంత్రి ప్లాన్ గా కనిపిస్తోంది. రాజధాని కేసును సుప్రీంకోర్టులో వాదించడానికి రాష్ట్ర ప్రభుత్వం 11 మంది న్యాయవాదులను ఎంగేజ్ చేయడం పట్ల, రఘురామకృష్ణంరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొమ్మేమి పోయిందని, లాయర్లకు ఇస్తున్న ఫీజు ప్రజా ధనమేనని గుర్తు చేశారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సహకారం అందించలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగిందని, మూడు రాజధానుల ఏర్పాటు విషయం తమకు తెలియదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖాలు ద్వారా స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డి తొందరపడి తాను కూడా విశాఖకు మకాం మారుస్తున్నానని పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రకటించడం, మంత్రులేమో తమ నోటికొచ్చినట్లు మాట్లాడడంతో ఇందులో కుట్ర కోణం దాగి ఉందని స్పష్టంగా అర్థం అయ్యింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం ఆరు నెలలు ఉన్నప్పుడు, కోర్టు లో కేసు ఎందుకు దాఖలు చేయలేదు. న్యాయం కావాలనుకుంటే, హైకోర్టులో అన్యాయం జరిగిందని భావిస్తే, వెంటనే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసి ఉండేవారు. విశాఖ పై ముఖ్యమంత్రి కి ఉన్న వ్యామోహం తో, అమరావతి లోని దళితులపై ఉన్న ద్వేషముతోనే అగ్రశ్రేణి లాయర్లను ఎంగేజ్ చేసుకుని సుప్రీంకోర్టులో వాదనలను వినిపిస్తున్నారు.
ప్యాలెస్ లో ఉండే సీఎం… పాకలు వేసుకోవడానికి తనది కాని స్థలం ఇస్తారట !
తాడేపల్లి ప్యాలెస్ లో నివసించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజధాని అమరావతి ప్రాంతంలో 900 ఎకరాల స్థలాన్ని పాకలు వేసుకోవడానికి పులివెందుల, పుంగనూరు నియోజకవర్గాల వారిని పిలిపించి ఇస్తారట అని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ పై విచారణకు వచ్చిన ఒక కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, న్యాయవాది జగన్మోహన్ రెడ్డిలు వాదనలు వినిపిస్తూ… బీదలకు భూమి ఇచ్చే హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదట… మీలార్డ్ అని అన్నారు. సి ఆర్ డి ఏ ఒక్కసారి భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని న్యాయవాది జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు . రాజధాని నిర్మించమని మాత్రమే రైతులు సి ఆర్ డి ఏ కు భూములను అప్పగించారు. రాజధాని నిర్మించకుండా, విశాఖకు తరలి వెళ్తామంటే వారు భూములు ఇవ్వలేదు. రాజధాని ప్రాంతంలో భూమి ఇవ్వమని అడిగిన వారే లేరని రైతుల తరపు న్యాయవాది, న్యాయమూర్తి దృష్టికి తీసుకురాగా, అడగకుండానే భూములు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ప్రభుత్వ తరపు న్యాయవాదులు తమ వాదనలో పేర్కొన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాజధాని ప్రాంతంలో పూరి గుడిసెలు ఎందుకు, కేంద్ర ప్రభుత్వం చక్కటి గృహ నిర్మాణ పథకాన్ని తీసుకు వచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఏమిటి ఈ కుట్ర?… మీ కుట్రను ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటున్నారా?? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన తీర్పు కాపీని రఘురామకృష్ణం రాజు చదివి వినిపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా ఉన్నప్పుడు ఇచ్చిన తీర్పు ఆధారంగానే, రాజధాని కేసు పై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. రాజధాని నిర్మాణం కోసం 38 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని సి ఆర్ డి ఏ కి అప్పగించారు. ఇందులో 55 నుంచి 60 శాతం బీసీ, ఎస్సి లే. రాజధానిలో దళిత, బీసీ సామాజిక వర్గాలు నివసించడం ఇష్టంలేకనే ప్రభుత్వ భూ పంపిణీ అడ్డుకుంటున్నారన్న ప్రభుత్వ తరుపు న్యాయవాదుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదని ఆయన తెలిపారు.
రాష్ట్రానికి వైయస్సార్ అని పేరు పెట్టుకోండి
కడప జిల్లాకు తొలుత వైయస్సార్ కడప జిల్లా అని నామకరణం చేసి, ఇప్పుడు వైయస్సార్ జిల్లాగా మార్చారని, అలాగే వైయస్సార్ ఆంధ్ర ప్రదేశ్ గా ఇప్పుడు పేరు పెట్టి , ఆ తరువాత వైయస్సార్ ప్రదేశ్ గా మార్చుకోండని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. ఏపీ వన్ యాప్ కు వైయస్సార్ ఏపీ వన్ గా నామకరణం చేయడం ఆశ్చర్యంగా ఉంది. పార్కులు, ఆసుపత్రులు, బస్టాండ్లకు వైయస్సార్ నామకరణం చేశారని, రాష్ట్రం పేరు కూడా మార్చి వేస్తే సరిపోతుంది. ఏపీ వన్ యాప్ కు వైయస్సార్ పేరు ను జోడించడం పట్ల, ప్రజలు కనీసం శాంతియుతంగానైనా తమ నిరసనను తెలియజేయకపోవడం బాధాకరంగా ఉంది. నామకరణ ఉన్మాదానికి, రంగుల ఉన్మాదాన్ని చూసి చిరాకు వేస్తోంది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలంటే, అభివృద్ధి చేయాలి తప్పితే, రంగులు వేసి గోడలపై పేర్లు రాస్తే… ప్రజల గుండెల్లో నిలువలేరని రఘురామ కృష్ణంరాజు అన్నారు .
రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రాణభయం
రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ఎంపీ తో సహా ఎమ్మెల్యేలకు ప్రాణభయం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇతరులపై తుపాకి గుళ్ళు కురిపిస్తున్నారు. దళితులపై రాష్ట్రంలో ధమనకాండ కొనసాగుతోంది. దళితులపై దాడులు నిత్య కృత్యమైపోయాయి. పులివెందులకు చెందిన భరత్ యాదవ్ అనే వ్యక్తికి స్థానిక ఎంపీ సిఫార్సుతో ప్రాణ రక్షణ కోసం తుపాకీ లైసెన్సును మంజూరీ చేస్తే, ఆ తుపాకీతో ఇతరుల ప్రాణాన్ని బలిగొన్నాడు. భరత్ యాదవ్ కు ప్రాణహాని ఉన్నదని తుపాకీ లైసెన్స్ మంజూరు చేసినట్లుగా ఎస్పీ హన్బు రాజ్ పేర్కొన్నారు. అవతలి వారి ప్రాణాలను తీసే వ్యక్తికి తుపాకి లైసెన్స్ ఎందుకు ఇచ్చారని మరొకసారి ప్రశ్నిస్తే తాను సీరియస్ అవుతానని ఆయన పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈనాడు దినపత్రిక యాజమాన్యంపై తాము కేసు వేసినందుకే రామోజీరావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారని రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వడం సిగ్గుచేటు. దళితులపై ఎక్కడ ఏ విధంగా దాడులు జరిగాయో, ఈనాడు దినపత్రికలో ప్రచురించిన కథనములో సవివరంగా వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ మారణకాండ కు అంతమే లేదా?, ఈ మరణాయజ్ఞం, మరణ మృదంగానికి ప్రజలు బలికావల్సిందేనా??, కుదరదు… అలా జరగనివ్వం, ప్రజలు మా వెనుక ఉన్నారు. ప్రజలన్నీ వాస్తవాలను తెలుసుకుంటున్నారు. అంతిమంగా కోర్టులే ప్రజలను రక్షిస్తాయి. ఒకటి రెండు సార్లు కోర్టులను అబద్ధాలు అద్భుతంగా చెప్పే న్యాయవాదులను ఎంగేజ్ చేసుకుని మభ్యపెట్టగలిగినప్పటికీ, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని రఘురామకృష్ణంరాజు అన్నారు.
రోజు రోజుకి కోర్టు తీర్పు మారడం పట్ల ఆలోచించనున్న విజ్ఞులైన ప్రజలు
ఒకే కోర్టులో రోజురోజుకు తీర్పు మారడం పట్ల విజ్ఞులైన ప్రజలు ఆలోచిస్తారు… ఇప్పుడు ఏది కరెక్ట్, నిన్నటి తీర్పా?, నేడు ఇచ్చిన తీర్పు?? అని నివ్వరపోవడం మినహా మనము చేయగలిగింది ఏమీ లేదని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా అభియోగాలను ఎదుర్కొంటున్న శివ శంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం కోర్ట్, హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కేసు విచారణ అధికారిని మార్చి, శివ శంకర్ రెడ్డి కి బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో తులసమ్మ కోరింది. విచారణ అధికారిని మారిస్తే, కేసు విచారణ త్వరగా ఎలా సాధ్యపడుతుంది. తులసమ్మ పిటిషన్ పై ఈనెల 27వ తేదీన కోర్టు విచారణ చేపట్టి తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకు విచారణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటు చేశామని సిబిఐ నేడు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది. కేసు విచారణకు ఉన్నతాధికారిని నియమించడంతోపాటు, రామ్ సింగ్ ను సభ్యుడిగా నియమించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 15వ తేదీ నాటికి కేసు విచారణ ముగిస్తామని పేర్కొనడం ద్వారా, ఈనెల 27వ తేదీన కోర్టు తీర్పుకు అనుగుణంగా సిబిఐ నడుచుకున్నట్లయింది. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రామ్ సింగ్ ను సిట్ సభ్యుడిగా నియమించడం పట్ల న్యాయమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. బొబ్బిలి పులి చిత్రంలో కథానాయకుడు ఎన్టీ రామారావు కోర్టు కోర్టుకు తీర్పు మారుతుందా? అని ప్రశ్నించారని, కానీ ఒకే కోర్టులో రోజు రోజుకు తీర్పు మారుతోందన్నారు . సి ఆర్ పి సి 156(2) ప్రకారం ఫలానా అధికారి ఈ కేసు విచారించడానికి వీల్లేదని చెప్పే అధికారం న్యాయస్థానాలకు లేదని చట్టం స్పష్టంగా చెబుతోంది. అయినా చట్టానికి అతీతంగా న్యాయస్థానం తీర్పు చెప్పవచ్చా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. సిబిఐ న్యాయవాది ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ, ఈ కేసులో సిబిఐ
న్యాయంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. డాక్టర్ సునీత తరపు న్యాయవాదిని తన వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వడం లేదు. నిజాయితీపరుడైన రామ్ సింగ్ అనే అధికారిని మార్చడానికి వైఎస్ వివేక హత్య కేసు దోషులు ఎన్నో ప్రయత్నాలను చేస్తున్నారు. వీరి ట్రాప్ లో న్యాయమూర్తి పడ్డారెమోనని భయం వేస్తోంది.. గతంలో రామ్ సింగ్ పై కేసు పెట్టి విచారించడానికి వీలులేదని, ఈ న్యాయమూర్తే
ఏడు వారాల క్రితం తీర్పు ఇచ్చారు. ఇలా అయితే కేసు విచారణ ఎలా వేగంగా కొనసాగుతుందని కూడా ప్రశ్నించారు. 15 రోజుల వ్యవధిలో కేసు విచారణ పూర్తి చేస్తామంటే, విచారణ బృందంలో రాం సింగ్ అనే అధికారిని మార్చమని ఇప్పుడు చెబుతున్నారు. ఇలా అయితే కేసు విచారణ మరో మూడు నెలలు ఆలస్యం అవుతుంది. కేసు విచారణ ఆలస్యం అవుతుంది కాబట్టి శివశంకర్ రెడ్డి కి బెయిల్ మంజూరు చేయాలని తులసమ్మ తరపు న్యాయవాది కోరారు. గతంలో బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదన్న న్యాయమూర్తి, పరిశీలిస్తామని పేర్కొన్నారు. 15 రోజులలో కేసు పూర్తి చేస్తామంటే, కాదు మూడు నెలల వ్యవధి పడుతుందని శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తారేమో?, అది న్యాయమూర్తి ఇష్టం. మొన్న ఇచ్చిన తీర్పు, ఈరోజు న్యాయస్థానంలోని వాదనలు జరిగిన తీరును మాత్రమే తాను వివరించాను . ఈ రెండింటిలో ఏది వాస్తవమో ఆలోచించుకునే హక్కు ప్రజలకు ఉంది. న్యాయస్థానం తీర్పు పై వ్యాఖ్యానాలు చేయవద్దు. ఎందుకు ఇలా జరిగి ఉండవచ్చు అని ప్రజలు ఆలోచించుకోవాలి. వైయస్ వివేకానంద రెడ్డి కేసు విచారణలో సీబీఐ కఠినంగానే ఉంది. ఇప్పటికే హైదరాబాద్ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదికలను అందజేసింది. సాక్షి దినపత్రికలో రాసిన రాతలకు మద్దతు చేకూర్చే విధంగా ఈరోజు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగాయి. సిబిఐ న్యాయవాది అన్యాయంగా మాట్లాడిన, సిబిఐ పిటీషన్ మాత్రం నిష్కల్మషంగా ఉంది. కోర్టు ప్రొసీడింగ్స్ చూసిన తరువాత లక్ష్మీనివాసం చిత్రంలో పాట గుర్తుకు వస్తుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు .
టీడీపీ శ్రేణులకు 41 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
తెలుగువారి ఆరాధ్య దైవమైన ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను ఆ పార్టీ శ్రేణులకు రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. పార్లమెంటులో ఎన్టీ రామారావు చిత్రపటానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా పూలమాల వేసి నివాళులు అర్పించడం నిజమైన రాజకీయాలకు నిదర్శనం. ఈ బంధం మరింత బలపడి ప్రజలకు అండదండలు అందించాలని కోరారు.