మార్చి 29 రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (AP Former CM Chandrababu Naidu) అన్నారు.
మార్చి 29 రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (AP Former CM Chandrababu Naidu) అన్నారు. అధికారం కావాలని ఎన్టీఆర్ (NTR) రాజకీయాల్లోకి రాలేదని, తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలనే పార్టీ పెట్టారని చంద్రబాబు తెలిపారు.
వసుదైక కుటుంబంగా ఉండడం మనందరి అదృష్టమని, చరిత్ర ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. పాలనలో ఎన్టీఆర్ సంస్కరణలు తీసుకువచ్చారని, మానవత్వమే తన సిద్ధాంతమని ఎన్టీఆర్ చాటి చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీకి ముందు.. తర్వాత అని మాట్లాడే పరిస్థితి ఉందని, ఆహార భద్రత కోసం రూ.2కు కిలో బియ్యం ఇచ్చారని, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశమని, స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, తాను వచ్చాక రిజర్వేషన్లను 34 శాతానికి పెంచానని చంద్రబాబు చెప్పారు.
రాజమండ్రిలో మహానాడు సభ ఏర్పాటు చేస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ గౌరవ సూచకంగా కేంద్రం రూ.100 వెండి నాణెం విడుదల చేసిందని, విద్యుత్, పోర్టులు, రోడ్లు సహా పలు రంగాల్లో సంస్కరణలు తెచ్చామన్నారు. మహిళలకు చేయూత కోసం డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చామని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన టీడీపీ బహిరంగ సభలో చెప్పారు. హైదరాబాద్‌లో ఘనంగా టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకలు జరిగాయి.