గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతోన్న సినిమా రామబాణం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కామెడీతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్సే. రెండూ భారీ విజయాలను అందుకున్నాయి. అందులోనూ లక్ష్యం సినిమా గోపీచంద్ – జగపతిబాబు అన్నదమ్ములుగా వచ్చిన సినిమా. మరోసారి ఈ ముగ్గురూ రామబాణంతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం కొత్తపోస్టర్ ను విడుదల చేసిన మేకర్స్.. కొద్దిసేపటి క్రితం ఒక డైలాగ్ టీజర్ ను వదిలారు. దీనిని బట్టి చూస్తే.. గోపీచంద్ – జగపతి బాబు మరోసారి అన్నదమ్ములుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ‘ఆ రాముడికి లక్ష్మణుడు .. హనుమంతుడు అనే ఇద్దరు ఉంటారు. ఈ రాముడికి ఆ ఇద్దరూ నేనే’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఇక గోపీచంద్ కు వదినగా ఖుష్బూ నటిస్తుండగా.. గోపీచంద్ కి జోడీగా డింపుల్ హయతీ నటిస్తోంది. విశ్వప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా అన్నదమ్ముల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుందనే విషయం స్పష్టమవుతోంది. నాజర్, సచిన్ ఖడేకర్, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.