భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తొలుత ప్రధానాలయంలో స్వామివారిని కల్పవృక్షవాహనంపై వూరేగింపు నిర్వహించారు. అనంతరం సామూహిక పారాయణం, హోమాలు చేశారు. రాములవారిని మిథిలా మండపానికి చేర్చే సమయంలో ‘జైశ్రీరామ్’ అంటూ భక్తులు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా పట్టాభిషేక మహోత్సవం గురించి అర్చకులు చేసిన ప్రవచనం అలరించింది. ఇటీవల దేశంలో నలు వైపులా ఉన్న పుణ్య నదులు నుంచి వైదిక సిబ్బంది సేకరించిన పుష్కర తీర్థాలను పట్టాభిషేకానికి తీసుకొచ్చారు. తొలుత మిథిలా మండపం వద్ద ఉంచి వాటికి ఆవాహన పూజలు చేశారు. ఈ నదీ జలాల విశిష్టతను వేద పండితులు వివరించారు. వేడుకను వీక్షించిన భక్తులందరికీ సకల శుభాలు కలగాలని ఆశీస్సులు అందించారు.
వైభవంగా భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం
