Devotional

ఒమాన్. రామనామ స్మరణతో మారు మోగిన ఎడారి..

ఒమాన్. రామనామ స్మరణతో మారు మోగిన ఎడారి..

రామనామస్మరణలతో మార్మోగిన ఎడారి
ఒమాన్ లో కనువిందుగా సీతరాముల కళ్యాణోత్సవం

ఎడారి నాట సీతారాముల కల్యాణ మంత్రాలతో, ‘శ్రీరామ.. జయరామ.. జయజయ రామ’ అన్న భక్తుల రామనామస్మరణలతో ఒమాన్ రాజధాని మస్కట్ లోని శ్రీ కృష్ణ మందిరం మార్మోగింది.

​గురువారం పని దినమైనా, రంజాన్ నిబంధనలు అమలులో ఉన్నా స్ధానిక సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రధ్ధలతో వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తులకు కనువిందు చేసింది. వేయి కిలో మీటర్ల దూరంలోని సలాల, సోహార్ మరియు ఇబ్రి ఎడారి ప్రాంతాల నుండి కూడ వందల సంఖ్యలో భక్తులు మస్కట్ కు తరలి వచ్చారు. అరటి తోరణాల నుండి మోదలు జీలకర్ర బెల్లం వరకు పూజకు అవసరమైన మోత్తం సామాగ్రిను స్ధానికంగా ఒమాన్ నుండి సమకూర్చుకోగా వారణాసి నుండి ప్రత్యెకంగా వచ్చిన పురోహితులు కప్పగంతుల దత్తాత్రేయ శర్మ, సత్యాధిత్యలకు స్ధానికంగా ప్రవాసీ పండితులయిన విజయకుమార్ తోడవడంతో వేదమంత్రాల మధ్య తెల్లవారు నుండి మోదలయిన కార్యక్రమం రాత్రి వరకు అంగరంగ వైభవంగా జరిగింది.

​స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, నివేదన అనంతరం ఉత్సవమూర్తులకు భక్తుల కోలాహలం, మంగళవాయిద్యాలు, భక్తుల కరతాళ ధ్వనులు, జయ రామ స్తోత్రాల నడుమ కల్యాణ క్రతువు పూర్తయింది. సీతారాముల కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను స్ధానిక తెలుగు ప్రముఖులు గుడేటి మధుసూధన్, సత్య వెంకట్, వెంకట కృష్ణారావు సత్తి, చందక రాందాస్ లు పర్యవేక్షించారు.