Politics

ఉదయగిరి ఎమ్మెల్యేకు మళ్లీ గుండెపోటు..

ఉదయగిరి ఎమ్మెల్యేకు మళ్లీ గుండెపోటు..

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మర్రిపాడులోని తన నివాసంలో ఉండగా ఆయనకు గుండెనొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులను రప్పించారు.

ఇంట్లోనే మేకపాటికి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యేను చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. గత నెలలో కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. అప్పుడు రెండు వాల్వ్ లు బ్లాక్ అయినట్లు గుర్తించిన వైద్యులు.. తగిన చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు.

అంతకుముందు 2021 డిసెంబర్ లోనూ చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. అప్పుడు బెంగళూరుకు తరలించి సర్జరీ చేసి స్టెంట్ వేసిన విషయం తెలిసిందే. రెండుసార్లు హార్ట్ అటాక్ రావడంతో స్టంట్స్ వేయించుకుని కోలుకుంటున్న ఆయన.. తాజా రాజకీయ పరిణామాలతో టెన్షన్ కు గురైనట్లు తెలుస్తోంది.

ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి వర్గం, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వబోమని, తరిమేస్తామని నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. దీంతో గురువారం సాయంత్రం మేకపాటి నేరుగా ఉదయగిరి బస్టాండ్ దగ్గరకు వెళ్లారు.. రోడ్డుపై కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నారు. ఎవరో ఉదయగిరికి వస్తే తరుముతామన్నారని.. వాళ్లెవరో ఇప్పుడు రావాలంటూ సవాల్ చేశారు.