మార్స్‌పైకి మనుషుల్ని పంపే పని ఆయనదే!
భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్, రోబోటిక్స్ ఇంజనీర్ అమిత్ క్షత్రియ అరుదైన ఘనతను సాధించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ- నాసాలోని ‘మూన్ టు మార్స్’ ప్రోగ్రామ్‌కు సారథిగా నియమితులయ్యారు.
భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్, రోబోటిక్స్ ఇంజనీర్ అమిత్ క్షత్రియ అరుదైన ఘనతను సాధించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం- నాసా కొత్తగా చేపట్టిన ‘మూన్ టు మార్స్’ ప్రోగ్రామ్‌కు సారథ్య బాధ్యతలు నిర్వహించునున్నారు. నాసాలోని ముఖ్య విభాగానికి సారథిగా నియమితులైన మొదటి భారత సంతతి వ్యక్తి అమిత్ క్షత్రియనే. వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయంలోనే.. అమిత్ సారథ్యంలో పనిచేసే ‘మూన్ టు మార్స్’ విభాగం ఉంటుంది. మానవాళి ప్రయోజనాల కోసం చంద్రుడు, అంగారక గ్రహాలపై నాసా తలపెట్టిన మానవ అన్వేషణ కార్యకలాపాలను నిర్వహించడం ఈ నూతన ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
మూన్ టు మార్స్ ప్రోగ్రామ్ చంద్రుడిపై మా సాహస ప్రయోగాలను నిర్వహించడానికి, అలాగే అంగారక గ్రహంపై మొదటిసారి మానవులను దింపడానికి నాసాను సిద్ధం చేయడంలో సహాయపడుతుందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.
చంద్రుడు, అంగారక గ్రహాలపై మరింత లోతైన అన్వేషణ జరుగుతోందని ప్రోగ్రాంలోని సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం పరిశోధన మొదటి దశలోనే ఉందని.. అంగారకుడిపై మావవాళి జీవించేందుకు సంబంధించి మరో ముందడుగు వేయడానికి ఈ కొత్త ప్రాజెక్ట్ సిద్ధమవుతోందని చెప్పారు. అంతేగాక చంద్రుడిపై దీర్ఘకాలిక మానవ ఉనికిని స్థాపించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
నాసా 2022 ఆథరైజేషన్ చట్టం ప్రకారం ‘మూన్ టూ మార్స్’ ప్రోగ్రామ్ సంస్థ హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్, మిషన్ ఇంటిగ్రేషన్‌తో పాటు రిస్క్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది. ఈ నూతన ప్రాజెక్ట్‌లో స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్, ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్, సపోర్టింగ్ గ్రౌండ్ సిస్టమ్, హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్, స్పేస్‌సూట్, గేట్‌వేతో పాటు అంతరిక్ష అన్వేషణకు సంబంధించిన మరిన్ని లోతైన అంశాలు ఉన్నాయి.అంతరిక్ష పరిశోధనల రంగంలో అమిత్ క్షత్రియ 2003లో తన ప్రస్థానం ప్రారంభించారు. ఆయన గతంలో ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ మిషన్ డైరెక్టరేట్(ఈఎస్‌డీఎండీ)కు తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. సాఫ్ట్‌వేర్, రోబోటిక్స్ ఇంజనీర్ గానే కాకుండా స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేటర్‌గా కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సేవలందించారు క్షత్రియ. 2014 నుంచి 2017 వరకు స్పేస్ స్టేషన్ ఫ్లైట్ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక తాజాగా ‘మూన్ టూ మార్స్’ ప్రోగ్రాం సారథిగా నియమితులైన అమిత్ క్షత్రియ వీటికి సంబంధించి అనేక కార్యక్రమాల్లో నాయకత్వం వహిస్తూ కీలక పాత్రను పోషించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రణాళికల రూపకల్పనతో పాటు వాటి అమలులో కూడా ఈయన నిర్ణయాలే ముఖ్య భూమిక పోషించనున్నాయి.