ఎ.పి.లో బిఆర్ఎస్ తన మనుగడ కోసం తాపత్రయం పడుతొంది.
తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఇక్కడి బంధాలు బంధుత్వాలు మాత్రం ఇప్పటికీ కలిసే ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు వ్యక్తిగత.. బంధుత్వాలు ముడిపడిఉన్నాయి. హైదరాబాద్ లో చాలా మంది ఆంధ్రా నేతలకు వ్యాపారాలున్నాయి. ఆ కోణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కు కొందరు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. తెలంగాణా కు చెందిన ఇద్దరు మంత్రులు ఎ.
పి.లో గత నెల రోజులుగా పర్యటించి బిఆర్ఎస్ ను ఆంధ్రాలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేదీ ఒక నివేదిక కెసిఆర్ కు సమర్పించడం జరిగింది. వాస్తవానికి బి.ఆర్.ఎస్.లో చేరడానికి ఎ.పి.లో జిల్లా స్థాయి నాయకులు గాని, నియోజకవర్గ స్థాయి నాయకులు గానీ ముందుకు రావడంలేదు.
మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో తటస్తులు ఒక విధమైన గుర్తింపు కోసం హైదరాబాద్ లో శ్రీ తోట చంద్రశేఖర్ ను కలుసుకుని పార్టీ కండువా కప్పుకుంటుంన్నారు.
అయితే జాతీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ కు అధ్యక్షుడిగా ఓ మీడియా అధినేత కం కాపు నేత, సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారి తోట చంద్రశేఖర్ దొరికారు. కానీ.. ఇక పార్టీ విస్తరణకు మాత్రం నేతల కొరత వేధిస్తోందట.. ప్రస్తుతం నేతల కోసం మళ్లీ కేసీఆర్ వేట మొదలుపెట్టినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీచేయాలంటే బలమైన నేతలు నీతి నిజాయితీ పాపులారిటీగల వాళ్లు అవసరం. అందుకే కేసీఆర్ ఇప్పుడు పార్టీలో చేర్చుకునేందుకు నేతల కోసం వెతుకులాట మొదలుపెట్టినట్టు సమాచారం.
పార్టీలో చేరడానికి అయితే భయపెట్టినో.. బతిమాలో చేర్చుకోవచ్చు. కొన్ని అలిగేషన్ల కారణంగా నేతలే చేరిపోతారు. కానీ ఏపీలో ఇప్పుడు బలమైన వైసీపీ టీడీపీ జనసేన ఉండగా.. రాష్ట్రం విడిపోవడానికి కారణమైన బీఆర్ఎస్ లో చేరితే రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయం అక్కడి నేతల్లో వ్యక్తమవుతోందట.. అందుకే కేసీఆర్ హామీలు ఇచ్చి మరీ చేర్చుకుంటున్నట్టు సమాచారం.
తమకు ఏదైనా హామీలు ఇస్తేనే చేరుతామని కొందరు నేతలు అంటుండగా.. ఎవరిని చేర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట. బీఆర్ఎస్ ఏపీ వర్గాలు. వ్యూహాత్మకంగా కొందరు మాజీ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు గాలం వేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఆలిండియా సర్వీస్ అధికారులు అయిన తోట చంద్రశేఖర్ రావెల కిషోర్ బాబులను చేర్చుకున్న కేసీఆర్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదట.. ఇక గంగవరం పోర్టు డైరెక్టర్ గా ఉన్న మాజీ డీజీపీ నండూరి సాంబశివరావును కూడా లాగుతున్నారని సమాచారం.
ఇటీవల విశాఖలోనే నండూరి సాంబశివరావుతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ భేటి అయ్యారు. పార్టీలో చేరాలని ఆయనను కోరినట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఆయన సమ్మతించినా మరో ఏడాది పాటు తన పదవీ కాలం ఉండడంతో అది చూసుకొని వస్తానని చెప్పినట్టు తెలిసింది.
ఇక ఏపీ సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ఓ బీసీ అధికారిని బీఆర్ఎస్ నేతలు సంప్రదించగా.. ఇంకా ఆయన ఏలాంటి స్పందన తెలియజేయలేదట.. ఇలా బీఆర్ఎస్ ఏపీలో నేతల కోసం శూలశోధన చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా జనసేన టికెట్ల కోసం ఆశపడి చివరి నిమిషంలో భంగపడిన వారికి బిఆర్ఎస్ టికెట్లు వచ్చే అవకాశాలున్నాయి.