26 నుండి అమెరికాలో తెలుగు సంబరాలు
నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఆధ్వర్యంలో అమెరికాలో ఈనెల 26, 27, 28 తేదీల్లో తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నట్లు నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి వెల్లడించారు. ఆదివారం గుంటూరులోని ఓ హోటల్లో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, తెలుగు సంబరాల కీన్వీనర్ అప్పసాని శ్రీధర్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సొంత నేలపై మక్కువతో నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. బాపయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న తెలుగు సంబరాలు ఈసారి కోవిడ్ వల్ల నాలుగేళ్ల తర్వాత నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ సినీ నటులు, దర్శకులను కూడా ఈ సంబరాలకు ఆహ్వానించామన్నారు. ఉత్తరాంధ్ర నుండి జానపద కళాకారులతో కళాప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. సేవే లక్ష్యంగా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి 2009లో ఏర్పాటు చేసిన నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉచిత కంటి వైద్యశిబిరాలు, ఆపరేషన్లు, కళ్లజోళ్లు అందచేశామని, రైతుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందచేస్తున్నామన్నారు. గ్రామాల్లో చెరువులు, రోడ్లు, పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంబరాల కన్వీనర్ శ్రీధర్ మాట్లాడుతూ సహాయం చేయాలనుకునే వారికి, సహాయం పొందాలనుకునే వారికి నాట్స్ ఒక వేదిక అని పేర్కొన్నారు. ఈ ఏడాది సంబరాలకు సమీకరించే 2.5 మిలియన్ డాలర్లలో 25 శాతం చారిటీలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కావున తెలుగు ప్రజలు ప్రపంచలో ఎక్కడ ఉన్నా ఈ సంబరాల విజయవంతానికి సహకరించాలని కోరారు. సమావేశంలో పి.చైతన్య తదితరులు పాల్గొన్నారు.