భద్రాద్రిలో సంప్రదాయబద్ధంగా దొంగల దోపు
భద్రాచలం, ఏప్రిల్ 2: వసంతపక్ష పుష్కరోత్సవాల్లో భాగంగా భద్రాద్రి సీతారామచంద్రస్వామికి ఆదివారం సాయంత్రం ఆహ్లాదకరంగా తెప్పోత్సవం నిర్వహించారు. కల్యాణ సీతారామచంద్రులను అందంగా అలంకరించి గోదావరిలో ప్రత్యేక తెప్పపై ఆశీనులను చేసి కనులపండువగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఇక రాత్రివేళ దొంగల దోపోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పరకాలుడి వేషధారి స్వామివారి శంఖుచక్రాలు, గొడుగు చోరీ చేయగా వాటిని భటులు స్వాధీనం చేసుకొని నిందితుడిని స్వామి ఎదుట ప్రవేశపెడితే.. నిందితుడు తప్పు అంగీకరించి క్షమించమని కోరతాడు. ఈ క్రమంలో పెరయ తిరుముడిలోని తొలి పది పాశురాలను అనుసంధానం చేసి పరకాలుడు వేషధారుడికి, భటులకు సన్మానం చేస్తారు.
పూర్వ చరిత్ర ఇదీ..
తిరుమంగై ఆళ్వార్ ఓ మండలానికి రాజుగా ఉంటారు. ఆయనకు ‘పరకాలుడు’ అనే పేరు కూడా ఉంది. కుముదవల్లి అనే అప్సరస శాపం కారణంగా మానవరూపంలో జన్మించడంతో ఆమెను వివాహం చేసుకోవాలని భావిస్తాడు. అయితే కొమదవల్లి ఏడాదిపాడు రోజుకు వెయ్యిమందికి అన్నదానం చేయాలని తిరుమంగైఆళ్వార్‌కు సూచిస్తుంది. దీంతో ఆ ఒప్పందంతో ఏడాది పాటు రోజుకు వెయ్యిమందికి తిరువారాధన(అన్నదానం) నిర్వహిస్తాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తి మొత్తం కరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన వద్ద ఉన్న నలుగురు నమ్మకమైన సహచరులతో కలిసి రాత్రిపూట దారి దోపిడీలు చేస్తాడు. ఈ సమయంలో ఆయన కేవలం ధనవంతుల వద్ద సొమ్మును అపహరించి వాటిని ప్రతిరోజు తదియారాదనకు వినియోగించేవారు. ఈ క్రమంలో ఒకరోజు లక్ష్మీసమేతుడైన శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో తిరుమంగై ఆళ్వార్‌కు తారసపడతారు. దీంతో తిరుమంగై ఆళ్వార్ స్వామివారి వద్ద ఉన్న ఆభరణలన్నింటినీ చోరీ చేసి చివరకు స్వామివారి కాలికి ఉన్న కడియంను ఇవ్వమని కోరతాడు. అయితే తాను ఇవ్వడానికి నిరాకరించి ‘నువ్వే ప్రయత్నించు’ అని శ్రీమన్నానారయణుడు తిరుమంగై ఆళ్వారుకు సూచిస్తారు. దీంతో ఆయన స్వామివారి కాలికి ఉన్న కడియంను తీసే క్రమంలో స్వామి పాదస్పర్శతో జ్ఞానోదయం పొందుతాడు. ఈ సమయంలో ఆయనకు అనర్గళంగా ఆశు కవిత్వం వస్తుంది. దీంతో ఆయన వెయ్యి పాశురాలు ఉన్న ‘పెరియ తిరుముడి’ అనే ప్రబందంతో పాటు మరో ఐదు ప్రబందాలను స్వయంగా రచించాడు. చివరకు వాటిని శ్రీరంగనాయకస్వామికి కైంకర్యం చేసి స్వామివారి సాన్నిధ్యం పొందాడు.