ఇంటి తాళం ఎక్కడ పెట్టాను? ఆ దూరపు బంధువు కూతురు పేరేంటి? ఈ సినిమాలో నటించిన హీరో ఎవరంటే? అంటూ ఇలా ప్రతిదీ మర్చిపోతుంటాం.
వయస్సు పెరిగిన కొద్ది అన్నింటిని గుర్తు పెట్టుకోవడం రోజురోజుకీ కష్టంగా మారుతుంది.
అయితే, ఇలా మర్చిపోవడం అనేది అనివార్యమైన ప్రక్రియ కాదని అంటున్నారు రిచర్డ్ రెస్టాక్. ఆయన ఒక న్యూరాలజిస్ట్. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ హాస్పిటల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్‌లో ప్రొఫెసర్ కూడా.
మెదడు మీద ఆయన 20కి పైగా పుస్తకాలు రాశారు.
మనం శరీరం కోసం వ్యాయాయం చేసినట్లుగా మెదడుకు కూడా వ్యాయామం అందిస్తే అదెప్పుడూ చురుగ్గా ఉంటుందని 81 ఏళ్ల రిచర్డ్ అన్నారు. నెరిసిపోయిన జుట్టుతో కనిపించే రిచర్డ్ జ్ఞాపక శక్తి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఆయనకు ప్రముఖ శాస్త్రవేత్తగా గుర్తింపు ఉంది.
మన జ్ఞాపక శక్తిని ఎలా పటిష్టంగా మార్చుకోవాలి? మెదడుకు ఎలా శిక్షణ ఇవ్వాలనే అంశాలను ఆయన బీబీసీతో చెప్పారు.
1. ఫిక్షన్ పుస్తకాలు చదవండి
నాన్ ఫిక్షన్ పుస్తకాలు సమాచారం, నాలెడ్జ్‌కు కేంద్రాలు. కానీ, జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విషయానికి వస్తే నవలలు చదవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.
జ్ఞాపకశక్తి పరంగా నాన్ఫిక్షన్ పుస్తకాలకు మంచి డిమాండ్ ఉండదు. పుస్తకంలోని కంటెంట్ జాబితాను చూసి మీకు ఆసక్తి ఉన్న అంశాన్ని ఎంచుకొని మీరు చదవొచ్చు.
కానీ, మెమరీ విషయానికొస్తే ఫిక్షన్ పుస్తకాలకు చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా నవలల చదువుతుంటే అందులోని పాత్రలు కళ్ల ముందుకు వస్తూ, పోతుంటాయి. రెండో చాప్టర్లో ఒక పాత్ర పరిచయం అవుతుంది. మళ్లీ పదో చాప్టర్లో ఆ పాత్ర గురించి మనం చదువుతాం. అప్పటి వరకు మధ్యలో దానికి సంబంధించిన ప్రస్తావన ఉండదు.
కథ గమనాన్ని గుర్తుపెట్టుకోవడం, పాత్రల మధ్య సంబంధాన్ని గుర్తుంచుకోవడం, కథాంశం వివరాలను గుర్తుపెట్టుకోవడానికి చాలా మెమరీ ఎఫర్ట్ అవసరం.
2. పదాలను బొమ్మలుగా మార్చండి
ఇది ఒక ప్రాథమిక సూత్రం. ఉదాహరణకు ఒక ఇంగ్లిష్ వ్యక్తి పేరు ‘‘గ్రీన్ స్టోన్’’ అనుకోండి. ఆయన పేరును గుర్తుంచుకోవడానికి మీరు ఆకుపచ్చ రాయిని మీ మెదడులో ఊహించుకోండని రిచర్డ్ సూచించారు. ఇది చాలా సరళమైన పద్ధతి.
‘‘ఒకవేళ మీరు ఆ పేరు విని వదిలేస్తే, తర్వాత మీకు అది గుర్తు రాకపోవచ్చు’’ అని అన్నారు.
మరో చిట్కా ఏంటంటే మనం గుర్తు ఉంచుకోవాల్సిన విషయాలను మనకు బాగా తెలిసిన వస్తువులతో గానీ లేదా మన పరిసరాలతో గానీ ముడిపెట్టి చూడటం.
3. స్నేహితులతో మెదడుకు మేత ఆటలు ఆడండి
పార్టీల్లో లేదా కుటుంబ సభ్యులందరూ కలిసిన సమయాల్లో రెస్టాక్కు బాగా నచ్చిన ఆట ఏంటంటే ‘’20 ప్రశ్నలు’’ ఆట. ఇది మెదడుకు మేత వంటి ఆట.
ఇందులో ఒక వ్యక్తి తన మనసులో ఒక వస్తువును గానీ, లేదా స్థలాన్ని గానీ, లేదా మరొక వ్యక్తి పేరును గానీ అనుకోవాలి.
అప్పుడు ఇంకో వ్యక్తి, సదరు వ్యక్తి మనసులో ఏం అనుకున్నారో తెలుసుకునేందుకు 20 ప్రశ్నలు అడగాలి. వాటికి మొదటి వ్యక్తి కేవలం అవును లేదా కాదు అని మాత్రమే సమాధానం ఇవ్వాలి.
కాకపోతే, ఇందులో ప్రశ్నలు పునరావృతం కాకూడదు. అంటే ఆ ఇద్దరు వ్యక్తులు, ఇప్పటివరకు ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఏయే ప్రశ్నలు అడిగారు? వాటికి ఏం సమాధానాలు వచ్చాయి అనే విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆటలోని అత్యంత కష్టమైన అంశం.
4. ముందు మెదడును.. తర్వాతే సాంకేతికతను వాడండి
సూపర్ మార్కెట్లో కొనాల్సిన వస్తువుల జాబితాను ఫోన్లో ఫొటో తీసుకొని వెళ్లడం చెడ్డ ఆలోచనేం కాదు
కానీ, ప్రతీ దానికి సెల్‌ఫోన్‌ను వాడటం లేదా ఇతర పరికరాలను ఉపయోగించడం మన జ్ఞాపక శక్తిని బలహీనపరుస్తుంది. వాటిని కూడా మనకు ప్రయోజనం కలిగించేలా ఉపయోగించుకోవాలి.
ఎలాగంటే, సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు కొనాల్సినవన్నీ మీరు మొదట గుర్తు పెట్టుకోండి. దాని ప్రకారమే వస్తువులను తీసుకొండి. అంతా అయ్యాక, మీరు ఇంకా ఏమైనా మర్చిపోయారా? అనేది తెలుసుకోవడం కోసం చివరగా ఫోన్లో ఫొటో తీసుకున్న జాబితాను చూడండని రిచర్డ్ చెబుతున్నారు.
మొదట మెదడును ఉపయోగించాలి. తర్వాత పరికరాన్ని ప్రత్యామ్నాయంగా వాడాలని ఆయన అన్నారు.
5. హాయిగా కునుకు తీయండి
కొన్ని ప్రాంతాల్లో కునుకు తీయడాన్ని సోమరితనంగా భావిస్తారు. కానీ, మంచి జ్ఞాపకశక్తి కోసం చిన్న కునుకు తీయడం అవసరమని చాలా అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ప్రతీ రోజూ రెస్టాక్ కాసేపు పడుకుంటారు. దీని వల్ల మెదడు చక్కగా సమాచారాన్ని గ్రహించి తనలో భద్రపరుచుకొని తర్వాత అవసరానికి అనుగుణంగా గుర్తు చేస్తుందని ఆయన చెప్పారు.
ఈ కునుకు విరామం 20 నిమిషాల నుంచి 40 నిమిషాలు ఉండాలని ఆయన సిఫార్సు చేశారు.
‘‘ఈ కునుకు సమయం 60 నిమిషాలు దాటితే మీకు రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి అలారం పెట్టుకోండి’’ అని ఆయన తెలిపారు.
6. ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండండి
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అదనపు కొవ్వు (ఎక్సెస్ ఫ్యాట్), అధిక ఉప్పు శాతం, ప్రిజర్వేటివ్‌లు ఉండే ఆహారాలను తినకూడదని ఆయన చెప్పారు.
‘‘ఈ ఆహారాలు జ్ఞాపక శక్తికి మంచివి కావు. ఎందుకంటే అవి జ్ఞాపకశక్తికి అనుసంధానమై ఉండే కణాల్లో రక్త ప్రసరణను తగ్గిస్తాయి. హైపర్ టెన్షన్, మధుమేహంకు దారి తీస్తాయి.
ఇవన్నీ చిత్తవైకల్యానికి కారణం అవుతాయి’’ అని రెస్టాక్ వివరించారు