ఈ నెల 12న ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డిని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 12న ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి భూపాల్‌రెడ్డిని ఆదేశించారు. ప్రతి ఏటా నిర్వహించే ఇఫ్తార్ వేడుకల్లో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని ప్రత్యేక పార్థనలు చేయడంతోపాటు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఈ ఇఫ్తార్ విందును తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో.. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేస్తారు. దానిలోభాగంగా.. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది నిరుపేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేయనున్నారు.
దానికి తగ్గట్లే.. ఒక్కో కమిటీకి 500 చొప్పున తెలంగాణలో 815 మసీదు మేనేజింగ్ కమిటీలకు ఇప్పటికే గిఫ్ట్ ప్యాకెట్లను సరఫరా చేశారు. ఇక.. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందరినీ గౌరవిస్తోంది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరురుస్తోంది.