తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో రద్దీ పెరిగిందని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. అధిక రద్దీ కారణంగా రూ.300 దర్శన టికెట్లు, ఎస్‌ఎ్‌సడీ, దివ్యదర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని శనివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. కాగా.. శుక్రవారం ఉదయం నుంచే తిరుమలకు భక్తుల రాక మొదలైంది. ఈ క్రమంలో శనివారం కూడా తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, మాడవీధులు, కొబ్బరికాయలు సమర్పించే అఖిలాండం, లడ్డూ వితరణ కేంద్రం, అన్నప్రసాద భవనం, బస్టాండ్, యాత్రికుల వసతి సముదాయాలు, రోడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 30 గంటల దర్శన సమయం పడుతోంది. టైంస్లాట్ టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతోంది.