సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో భిన్నమతాల వారంతా కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో పాటు హిందూ, క్రైస్తవ మతస్తులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని.. పరమత సహనాన్ని వందలాది తెలుగు ప్రవాసీయులు నిరూపించారు.\
సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో భిన్నమతాల వారంతా కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో పాటు హిందూ, క్రైస్తవ మతస్తులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని.. పరమత సహనాన్ని వందలాది తెలుగు ప్రవాసీయులు నిరూపించారు. ‘అల్లాహుమ్మ లక సుంతు వబిక ఆమంతు’ అంటూ విజయవాడకు చెందిన అబ్దుల్ సాదిఖ్ ఉపవాస దీక్షను వీడుతుండగా.. పక్కనే గుండబోగుల ఆనంద్ రాజు మరోవైపు చిట్లూరి రంజీత్ కుమార్.. గౌరవసూచకంగా తోడయిన సన్నివేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించింది. ఇంటా బయటా అసహానం వెల్లడవుతూ.. అంతటా విద్వేష వాతావరణం కనిపిస్తున్న వేళ హిందూ ముస్లిం మరియు క్రైస్తవ మతాలకు చెందిన తెలుగు ప్రవాసీయులు అంతా కలిసికట్టుగా నిర్వహించిన ఈ కార్యక్రమం ‘జాన్ జానీ జనార్ధన్’గా నిలిచింది.
రియాధ్ నగరంలో శుక్రవారం సాయంత్రం సౌదీ అరేబియా తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా’ నిర్వహించిన ఇఫ్తార్ విందులో వందలాది మంది ప్రవాసులు పాల్గొన్నారు. ఎడారి దేశంలో అచ్చం తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా గోదావరి రుచుల ఘుమఘుమలు ‘రంజాన్ ఇఫ్తార్ విందు’ను మరింత రుచికరం చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరటి ఆకులపై అన్నం వడ్డీంచిన తీరు ఇంటి భోజనాన్ని తలపించింది.
కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న తెలుగు వారికి తాటి శ్రీదేవి, సుచరితలు, మరో వైపు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉపవాస దీక్షలను తూచా తప్పకుండా పాటిస్తున్న క్రైస్తవ సోదరులకు రమ్య మరియు ఉశ శ్రీలు, రంజాన్ మాసంలో నిత్యం ఉపవాసముంటూ ఖురాన్ చదివే సఫీయా.. ఇలా అందరూ కలిసి ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేశారు. మతాలు వేరయినా తమలో ‘తెలుగు భాషపై మమకారం’ మాత్రం ఒకే విధంగా ఉంటుందంటూ రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు ఈ సందర్భంగా నిరూపించారు. సందర్భం ‘ఇఫ్తార్’ అయినా సన్నివేశం మాత్రం పూర్తిగా తెలుగుతనమని ఈ సందర్భంగా ముజమ్మీల్ శేఖ్ వ్యాఖ్యానించారు.
కార్యక్రమ నిర్వహణలో మహిళలు కీలక పాత్ర వహించారు. సాటా మహిళ విభాగం అధ్యక్షురాలు సుచరితకు తోడుగా రమ్య, శ్రీదేవిలు ప్రధాన భూమిక పోషించారు. లక్ష్మి కాకుమని వ్యాఖ్యాతగా సభికులను ఆకట్టుకోగా.. రంజాన్ ఉపవాస దీక్ష గూర్చి సఫీయా వివరించారు. భోజన ఏర్పాట్లను గీతా, పవన్‌లు పర్యవేక్షించగా లక్ష్మీ మాధవి, వి.భారతీ, దాసరి భారతీ తదితరులు చిన్నారుల కార్యక్రమాలను నిర్వహించారు. అందరికి తోడుగా శ్వేత రియాజోద్దీన్, ఈగలపాటి ఇందిర తమ వంతు సహాయసహాకారాలు అందించారు. రియాధ్ నగర తెలుగు ప్రముఖులు ముజమ్మల్ శేఖ్, ఆనంద్ పోకూరి, చిట్లూరి రంజీత్ కుమార్, గుండబోయిన ఆనందరాజు, దుర్గపు ఎర్రన్న, జానీ బాషా, సూర్య, వినయ్ చేగూరి, సత్తీబాబు, చంద్ర తదితరులు కార్యక్రమ నిర్వహణ భాద్యతలను సమన్వయం చేశారు. మల్లేషన్, సుచరిత, ఇందిర, భవానీ, గీతా, సమీ, నవాజ్, జరీర్ మెడికల్, పటేల్ రైస్ తదితరులు కార్యక్రమానికి సహాయసహకారాలు అందించారు. త్వరలో మరిన్ని ఇఫ్తార్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా మల్లేషన్ వెల్లడించారు.