Politics

నూజివీడు తెలుగుదేశం నేతలకు చంద్రబాబు గట్టి వార్నింగ్..

నూజివీడు తెలుగుదేశం నేతలకు చంద్రబాబు గట్టి  వార్నింగ్..

పంచాయతీలు పెడితే చర్యలు తప్పవు : చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయ పథంలో నడిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

దీనివల్ల ఇప్పటికీ కార్యక్షేత్రంలోకి రాని నియోజకవర్గ ఇన్ ఛార్జిలతోపాటు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. మరో రెండురోజుల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలోని నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈసారి అక్కడ టీడీపీని గెలిపించడానికి ఇప్పటినుంచే వ్యూహాలు రూపొందిస్తున్నారు.
చంద్రబాబు పర్యటలనను దృష్టిలో ఉంచుకొని ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ ఇన్ ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఏర్పాట్లు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మండలాలవారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు చాట్రాయి, ఆగిరిపల్లి మండలాలకు సంబంధించిన పార్టీ నాయకులు హాజరుకాలేదు. వారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండు మండలాలకు చెందిన నాయకులకు, ముద్దరబోయినకు విభేదాలు కొనసాగుతుండటమే దీనికి కారణం.
ఈ విషయంపై ముద్దరబోయిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుణ్ని కలిసి ఫిర్యాదు చేశారు. అచ్చెన్న ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయడం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలికానీ.. పనిచేయకుండా ఈ పంచాయితీలేంటని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓటమిపాలైంది. రాజధాని ప్రాంతానికి సమీపంలోని నియోజకవర్గం కావడంతో ఎలాగైనా ఈసారి అక్కడ పార్టీని గెలిపించాలనేది చంద్రబాబు యోచనగా ఉంది. పర్యటన ముగిసిన తర్వాత నియోజకవర్గానికి చెందిన నాయకులందరినీ పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు.