తుంగబద్ర నదీతీర ప్రాంతాలైన కంపిలి, బల్లారి, ఆనెగొంది, తదితర ప్రాంతాలనుండి వివిధ కారణాలతో చాలామంది దక్షిణాది కావేరి తీరప్రాంతాలకు చేరుకొని వివిధ ప్రాంతాలలో కుదురుకొన్నారు. అలా కొంతమంది అడవి ప్రాంతాలలో ఆవాసం ఏర్పరచుకొన్నారు. గొల్ల, ఇరుళ, కొరువ, కురుంబ, తొట్టైయర్లు మొదలైన వారిని ‘కాట్టునాయకర్లు ’ అని వ్యవహరిస్తారు. ‘కాడు’ అంటే అడవి అని అర్థం. వీరిని ‘హంటర్ గేథరర్స్’ అనికూడా అంటారు. ఒకప్పుడు లోతట్టు అడవుల్లో నివసించే కాట్టునాయకర్లు ప్రధాన వృత్తి వేట! అంతేగాక అడవిలో లభించే తేనె, పండ్లు, శీకాకాయ, సుగంధ ద్రవ్యాలు తమకు అవసరమైనంత మేర సేకరించి చిన్న చిన్న గుడెసెలు వేసుకొని జీవనం కొనసాగించేవారు. కొందరు పాలేగార్లుగా స్థిరపడి సంస్థానాలను ఏలినారు. వారిని రాజకంబల నాయకర్లుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా కొందరు గోవులను మేపేందుకు వెళ్ళేప్పుడు భుజముపై కంబలి ధరిస్తారు కావున వీరు “కంబలనాయకర్లు” అయ్యారు.
నేను తమిళనాడులో తెలుగువారిపై పరిశోధన చేస్తున్నప్పుడు దాదాపు చాలా జిల్లాలు తిరిగాను. తమిళనాడులో 50,000 మందిపైగా కాట్టునాయకర్లు ఉన్నారు. ముఖ్యంగా నీలగిరి, కడలూరు, కన్యాకుమారి, నాగపట్నం, విరుద్ నగర్, తిరునల్వేలి, తిరువారూర్, చెంగల్పట్టు, కంచి, ధర్మపురి, విళుపురం, రామనాథ పురం, సేలం తదితర జిల్లాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నారు.
నేటి పరిస్థితులు మారిపోయి వేటాడటం చట్ట వ్యతిరేకం కావడంతో, వేరే అవకాశం లేకపోవడంతో, సంచారయాచకులుగా, కూలీలుగా, ఆటోలు నడుపుతూ కొందరు, చిన్న వ్యాపారాలు చేస్తూ, అటవీశాఖలో జంతు సంరక్షకులుగా మరికొందరు చిన్న చిన్న పనులుచేసుకొంటూ వస్తున్నారు. కరుప్పు స్వామి వీరి కులదైవం. కాళీకాదేవికి సైతం
పూజలు చేస్తారు. ప్రతీయేట వైగాసి (మేనెల)లో సంబరాలు ఘనంగా చేస్తారు. వారి పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన జానపద గీతాలను ఇప్పటికీ పాడుకొంటూ కాపాడుకొంటూ వస్తున్నారు.
ఉదా.
ఏళా ఏళా ఏళో ఏళ ఏళో హైలెస్సా……
ఈడ్చి సెప్పండా! హైలెస్సా….
బిడ్డలు సెప్పండా! హైలెస్సా….
తల్లులు సెప్పండా! హైలెస్సా….
సిన్నపిల్లలు సెప్పండా!…హైలెస్సా….
అడవుల్లో క్రూరమృగాల నుండి తప్పించుకొనేందుకు ప్రత్యేక వాయిద్యాలు ఉపయోగించేవారు. ఇప్పటికీ ఆ వాయిద్యాలను వారు వాయిస్తూనే ఉన్నారు. నేటి యువతులు సైతం వాటిని వాయించడం విశేషం. వీరి ఆరాధ్య దైవం జక్కమ్మ! బొంగు చెట్లను సైతం మొక్కుతారు. అడవుల్లో వన్యమృగాలతోపాటు కలసి జీవించడం కాట్టునాయకర్లకు పరిపాటి! అందుకే వన్యప్రాణుల పోకడలు వీరికి బాగాతెలుసు!
అందుకు ప్రత్యక్ష ఉదాహారణ – మొన్న జరిగిన ఆస్కార్ పురస్కారాలలో ఉత్తమ లఘు చిత్ర(డాక్యుమెంటరీ క్యాటగిరీ) దర్శకత్వ విభాగం, ఉత్తమ నిర్మాణ విభాగంలో రెండు పురస్కారాలను కైవసం చేసుకొందీ లఘుచిత్రం ఎలిఫంట్ విస్పరర్స్. మహిళలు తీసిన నిజజీవిత గాథ ‘అమెరికా’లో ఆస్కారు పురస్కారం లభించండం భారతీయులు అందరం గర్వించదగ్గ విషయం!
గున్న ఏనుగుల గుసగుసలు
తమిళనాట నీలగిరి కొండలలో జరిగిన చిత్రం! ఏనుగుల వల్ల ప్రేమ చిగురుస్తుందని అది ఏడడుగుల వరకు నడిపిస్తుందని ఎవరూ ఊహించలేం, వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకొని ఒక్కటయ్యారు!
‘’తల్లి ఏనుగుకు విద్యుత్ తీగ షాక్‌కొట్టి కనుమరుగైంది!
పిల్ల ఏనుగు తల్లిలేక తల్లడిల్లి పోయింది!
అడవిలో ఆవులతో పాటు తిరిగి గడ్డితిన్నది!
ఊరిలోకి వచ్చి పండ్లుతిని దెబ్బలు తిన్నది!
గున్న ఏనుగు కుక్కల కాట్లకు గురైంది!
చావు బ్రతుకుల మధ్య పోరాడింది!
ముధుమలై సంరక్షణాలయానికి తరలించబడింది!
అక్కడ బొమ్మడు – బెల్లి ఇద్దరూ కలసి
అనాదైన బిడ్డకాని బిడ్డను చేరదీశారు!
‘రఘు’ అనే ముద్దుపేరు పెట్టారు!
‘అమ్ము’ అనే మరో ఆడగున్నకూడా వారి పంచన చేరింది!
జలపాతాల్లో జలకాలాడించారు! కబుర్లాడారు!
కంటికి రెప్పలా బొమ్మడు – బెల్లీలు కాపాడారు!
వాటి సంరక్షణే వారి ప్రపంచం అయిపోయింది!
క్రమంగా అవి వారి బిడ్డలై పోయాయి!
బెల్లి ఏనుగుల తల్లి అని అందరిచేత పిలవబడ్డది!
మనస్సులు కలిసి వారిరువురూ ఒక్కటయ్యారు !
ఈ జరిగిన తతంగాన్ని కార్తికీ గొంజాల్వేస్ దర్శకత్వంతో కళ్ళకు కట్టినట్లు చూపించారు! ఐదేండ్లు(2017-2022 సం. వరకు) దృశ్యీకరించి, చిత్రీకరించారు! గునీత్ మంగా నిర్మించారు! లఘు చిత్రంగా మలిచారు! చిత్రంకన్నా లఘు చిత్రం తియ్యడం కష్టం! ఇది ఒకవిధంగా కత్తిమీద సాము లాంటిదే! కథ సిద్ధంగా ఉండదు! అంతకుమించి వారు నటీనటులు కారు!
ప్రమాదంలో ఉన్న ఏనుగులను రక్షించుకోవాలన్న తాపత్రయం!
అంతరించిపోతున్న జీవజాతులను కాపాడలనే వారి ప్రయత్నం!
మనిషికి – వన్యప్రాణులకు మధ్యగల బంధాన్ని చూసి మనస్సు చలించింది !
ఈ దశగా లఘుచిత్రాన్ని తీయడానికి వారిని అడుగు వేయించింది!
అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ పురస్కారం వారిని వరించింది!
తమిళనాడు ముఖ్యమంత్రిచే కోట్లరూపాయాల నగదు పురస్కారాన్ని అందుకొంది!
మన దేశ ప్రధానే మంత్రి స్వయంగా
ముదుమలై అడవుల్లోని తెప్పకాడు ఏనుగుల సంరక్షణాలయానికి చేరుకోవడం!
బొమ్మన్ , బెల్లీలను గౌరవప్రదంగా కలవడం!వారిని ప్రశంసించడం!
అభినందనలు తెలియ చేయడం అత్యద్భుతం !
చరిత్రపుటలలో నిలిచిపోయేది!
సందేశం – మానవుడు అడవులను ఆక్రమించి వన్యప్రాణులకు ముప్పు కలిగిస్తున్న ఈ తరుణంలో ఈ చిత్రం ప్రకృతి మూగజీవాలను కాపాడలన్న సందేశంతో కనువిప్పు కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహంలేదు!
ఆస్కారు పురస్కారం పొందిన సందర్భంగా “ఆస్కారు వచ్చిందన్నారు మావాళ్ళు! అదేమిటో మాకు తెల్వదు సారు!” అన్నాడు ఆ గున్నఏనుగుల ఆలనాపాలనా చూసిన అయ్యకాని అయ్య బొమ్ము!
“రఘు, అమ్ము, ఆయనతో కలసి ఒకే కుటుంబంగా మెలిగేవాళ్ళం! పెద్దయ్యాక వాటిని అప్పజెప్పినపుడు మా కుటుంబం ముక్కలైనట్లు అన్పించింది! వాటి దగ్గరకు మేము వెళ్తే ఇప్పటికీ మమ్మల్ని గుర్తుపట్టి తొండాల్ని ఊపుతాయి! అంతకన్నా మాకు ఏమి కావాలి! వాటిని మా బొందిలో ప్రాణమున్నంతవరకు మరచిపోము!” అంది ఆ అమ్మకాని అమ్మ బెల్లీ! వీరి సామాజిక వర్గం లో నేడు బొమ్ము, బెల్లి సూపర్ స్టార్లు అయ్యారు!
తమిళనాట అతిసాధారణ జీవనం కాట్టునాయకర్లు కొనసాగిస్తున్నారని అనడానికి ఆ ఏనుగు గుసగుసలాడిన కుటుంబమే సాక్ష్యం! బహుశా ఆ చిత్రాన్ని నిర్మించిన వారికి ఆనిరుపేదల నేపథ్యం తెలియకపోవచ్చు!
అయితే ఆ గున్న ఏనుగుల కాట్టు నాయకర్ల కుటుంబ నేపథ్యం వెనుక తెలుగు మూలాలు ఉందని తెలిసి ఆశ్చర్యపడనక్కరలేదు. వారు తమదైన యాసలో తెలుగు మాట్లాడుకొంటారు.
అందులో శిక్షకుడు పేరు ‘బొమ్ము’ అని చెబుతున్నారు. వాళ్ళపేర్లు ఎక్కువగా బొమ్ము, బొమ్మడు, బొమ్మాయి, అని ఉన్నాయి. అమ్మాయిలకైతే పేరు చివర బొమ్మాయి అని చేరుస్తారు. ఈ సందర్భంలో అదేపేరుగల ఒక గొప్ప అమరవీరుడు గుర్తుకు వస్తాడు. ఆయనపేరుకూడా ‘బొమ్ము’! ఆయన తల్లిభాషకూడా తెలుగు. ఆయన ఇంటిపేరు ‘గట్టి’ అయితే తమిళంలో క,ఖ,గ.ఘ,లకు ఒకే అక్షరం కాబట్టి ‘గట్టి’ కూడా ‘కట్టి’గాను కాలక్రమంలో ‘కట్ట’గాను మారిపోయింది. ఆ చారిత్రక పురుషుడు ఎవరో కాదు తమిళంలో ‘కట్టబొమ్మన’గా, తెలుగులో ‘కట్టబ్రహ్మన’ గా వ్యవహరింపబడుతున్న పాంచాలం కురిచి పాలకుడే! ఈ పాంచాల కురుచి సంస్థానం తూత్తుకుడి జిల్లాలో ఉంది. ఆయన పేరుకు పాలేగారే కావచ్చు! మహాచక్రవర్తి కాకపోవచ్చు! మహావీరుడని, అసమాన త్యాగ ధనుడని అంగీకరించక తప్పదు! బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని ఎదిరించి, ఆ పరాయి పాలకులకు పన్నులు ఎందుకు కట్టాలి? అంటూ తిరుగుబాటు చేసినాడు ఆ గట్టిబొమ్ము! బ్రిటిష్‌వారు కక్షతో సంస్థానంపై దాడిచేసి, నిర్మించిన కోటను కూలగొట్టిన అనతికాలంలో తిరిగి అదేచోట కోటను నిర్మించుకొన్న ధీశాలి! బ్రిటిష్‌వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను, తనని అంతం చేయకుండా విడిచిపెట్టరని తెలిసి, తప్పించుకొన్న క్రమంలో ఎవరో ఇచ్చిన సమాచారంతో వారికి పట్టుబడి కోవిల్పట్టి సమీపంలోని కయత్తార్ గ్రామంలో ఉరితీయబడ్డాడు.
అంతటి మహదీయుడ్ని ఉరితీయబడ్డ స్థలం కయత్తార్ ను దర్శించినపుడు మనం ఉద్వేగభరితానికి లోనవుతాం. అయితే అక్కడి ప్రభుత్వం వారు సృష్టించిన బోర్డుపైన “తమిళకింగ్’’ అని వర్ణించడం చివుక్కుమని పిస్తుంది. ఎందుకంటే “కట్టబొమ్మన్” అని కొందరు తమిళులు ఉత్సాహపడుతున్న సమయంలో 1960 సం. ప్రాంతంలో ప్రఖ్యాత
తమిళభాష పండితుడు చారిత్రాకారుడు అయిన “శివజ్ఞాన గ్రామణి” కట్టబొమ్మన నూటికి నూరు పాళ్ళు తెలుగు వాడేనని ఈ విషయం పై అనవసర రాద్దాంతం చేయడం తగదని చెప్పారు.
తొట్ట తొలి తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడు కట్టబొమ్మడు (కట్టబొమ్మన్) . భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఇలాంటి మహనీయుల త్యాగాలను ఎన్నటికీ మరచిపోలేము.
అలాగే కోవిల్పట్టి సమీపాన యట్టియాపురం సంస్థానాన్ని రాజకంబల నాయకర్లు పాలించారు. ఇక్కడ చెప్పుకోవసిన ముఖ్య విషయం తెలుగు భాషను సుందర తెలుగు అని ప్రశంసించిన ప్రసిద్ధుడైన తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఈ సంస్థాన ఆస్థాన కవి. ఇలాగే కేరళ సరిహద్దుల్లో ఉన్న బోడినాయకనూరు, దేవారం సంస్థానాలను కూడా రాజకంబలనాయకర్లు పాలించారు
తెలుగు మూలాలు కలిగి, పూర్వీకులు బల్లారి ప్రాంతం వారైనా, కాలవశాన ఇతర ప్రాంతాలకు చెదరిపోయినా వారిపేర్లలల్లో, పాటల్లో, ఆచారాలలో, మాటల్లో తెలుగును నిలుపుకొని ఉండటం ఆశ్చర్యం!
*ఈ లఘుచిత్రంలోని పాటను పరిశీలించినపుడు “బాగున్నవా …నాగయ్య”….తెలుగు పదాలు విన్పించడం గమనార్హం!
– డా. సగిలి సుధారాణి
9490428825