Politics

భూ దోపిడీతో కేసీఆర్ లక్ష కోట్లు వెనకేసుకున్నాడు

భూ దోపిడీతో కేసీఆర్  లక్ష కోట్లు వెనకేసుకున్నాడు

కేసీఆర్ భూ దోపిడీని సీరియల్ గా విడుదల చేస్తాం

నిబంధలనలకు విరుద్ధంగా పార్థసారధి రెడ్డి సంస్థకు భూ కేటాంపులు

తద్వారా పార్థసారథిరెడ్డికి రూ.5,344 కోట్ల లబ్ది

కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి వందల కోట్ల సాయం

అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారు

కేసీఆర్‌ మోడల్‌ దేశానికే ప్రమాదం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ భూ దోపిడీతో కేసీఆర్ లక్ష కోట్లు వెనకేసుకున్నాడు. కేసీఆర్‌ మోడల్‌ దేశానికే ప్రమాదం అంటూ ధ్వజమెత్తారు. ఒక్క కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీంలకు సమానమని దుయ్యబట్టారు. కర్నాటకలో కాంగ్రెస్‌ను అస్థిరపరచాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్‌ వందల కోట్లు ఇస్తున్నారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. జేడీఎస్‌ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేల కోట్లు సమకూర్చుతా అని బేరసారాలు మొదలుపెట్టారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. తనతో ఉన్న వాళ్లుకు భూములు పంచుతున్నారన్నారు.

తెలంగాణ చరిత్రను గమనిస్తే.. భూమి కేంద్రంగానే పోరాటాలు జరిగాయన్నారు. భూమి కన్నతల్లి… భూమి ఆత్మగౌరవం..సాయుధ రైతాంగ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు భూమి కోసమే జరిగాయి. కేసీఆర్ రాష్ట్రంలో భూ దోపిడీకి పాల్పడ్డారు. భూ దోపిడీతో కేసీఆర్ లక్ష కోట్లు వెంకేసుకున్నాడు. భూ మాఫియా ద్వారా వచ్చిన సొమ్ముతో దేశ రాజకీయాలను శాసించాలనుకుంటున్నారని విమర్శించారు.

హెటిరో పార్థసారధి రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కరోనా సమయంలో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. 2021 అక్టోబర్ లో జరిగిన ఇన్ కం ట్యాక్స్ రైడ్స్ లో హెటెరో డ్రగ్స్ లో రూ.142 కోట్లు నగదు కట్టలు కట్టలుగా దొరికింది. విదేశాలలో నల్లధనం దాచుకున్న వారి వివరాలను వెల్లడిస్తూ 2021 డిసెంబర్లో పనామా పేపర్స్ కొన్ని సంస్థలు, వ్యక్తుల పేర్లు వెల్లడించింది. ఆ జాబితాలో పార్థసారథి రెడ్డి కూడా ఉన్నారు. ఆయన సారథ్యంలోని హెటెరో డ్రగ్స్ పై మనీలాండరింగ్, ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి. హెటెరో డ్రగ్స్ కంపెనీ ద్వారా సంపాదించిన బ్లాక్ మనీతో పార్థసారథి రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కూడా దిగారు. 20 కి పైగా వెంచర్లు వేసి రియల్ వ్యాపారం చేస్తున్నారు. అటువంటి ఆర్థిక నేరగాడు పార్థసారథిరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారు.
అలాంటి పార్థసారథి రెడ్డి పార్థసారథి రెడ్డి 2014 లో సాయి సింధు ఫౌండేషన్ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కేన్సర్ ఆసుపత్రి కడతానని… ట్రస్ట్ కు 15 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా ఆగస్టు 20, 2015న ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. సీఎస్ 15 ఎకరాలు అక్కర్లేదు 10 ఎకరాలు చాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

అక్టోబర్ 7, 2016 లో తెలంగాణ కేబినెట్ ఆయన దరఖాస్తును ఆమోదిస్తూ శేరిలింగంపల్లి మండలం, ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 41/14 -2లో (హైటెక్ సిటికీ అత్యంత సమీపంలో) 15 ఎకరాల అత్యంత ఖరీదైనా భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏదైనా ట్రస్టు, సంస్థ లేదా వ్యక్తికి ప్రభుత్వం ఇంచ్ భూమి కేటాయించాలన్నా దానికి భూ కేటాయింపుల పాలసీ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే నెంబర్ 1 తేదీ 14-09-2012) ద్వారా ఈ పాలసీ తెచ్చారు. ఈ పాలసీ ప్రకారం ఎవరికి భూమి కేటాయించాలన్నా అప్పటి మార్కెట్ విలువను లెక్కగట్టి… దానిపై 10 శాతం అద్దెను నిర్ణయించాలి. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి సమీక్షించి ఈ అద్దెను 10 శాతం పెంచుతూ పోవాలి.
2012లో ఇచ్చిన జీవో 571 లో కూడా లోపాలు ఉన్నాయని… కేసీఆర్ ప్రభుత్వం 01-12-2015 నాడు జీవో నెంబర్ 218 తెచ్చింది. ఈ జీవో ప్రకారం భూ కేటాయింపు సమయంలో మార్కెట్ ధరను అంచనా వేసి దానిపై 10 శాతం అద్దెను నిర్ణయించాలి. ప్రతి ఐదేళ్లకు భూ మార్కెట్ విలువపై 10 శాతం అద్దెను నిర్ణయిస్తూ రావాలి.
సాయి సింధు ఫౌండేషన్ దరఖాస్తు ఆధారంగా… అప్పటి డిప్యూటీ కలెక్టర్ శేరిలింగంపల్లి మండలం సర్వేనెంబర్ 41/14 – 2, ఖానామెట్ గ్రామ (హైటెక్ సిటికీ అత్యంత సమీపంలో) భూమి మార్కెట్ విలువను అంచనా వేసి ఎకరాకు రూ.33.70 కోట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు 10 – 08 – 2016 నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ నివేదిక ప్రకారం సదరు సర్వే నెంబర్ లో 15 ఎకరాల మొత్తం విలువ (33.70 కోట్లు × 15 ఎకరాలు) రూ.505.50 కోట్లు అవుతుంది. జీవో నెంబర్ 571 ప్రకారం దీనిపై 10 శాతాన్ని అద్దెగా నిర్ణయించాలి. అంటే సాయి సింధు ఫౌండేషన్ తనకు కేటాయించిన 15 ఎకరాల భూమికి, ఏడాదికి రూ.50.50 అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఐదేళ్లకు మళ్లీ మార్కెట్ విలువ అంచనా కట్టి పెంచాల్సి ఉంటుంది. కానీ జీవో 571 నిబంధనలను తుంగలో తొక్కి అత్యంత నామమాత్రంగా ఏడాదికి రూ.1,47,743 మాత్రమే అద్దెగా నిర్ణయిస్తూ ప్రభుత్వం సాయి సింధు ఫౌండేషన్ కు భూమిని కేటాయిస్తూ మార్చి 22, 2018 నాడు జీవో విడుదల చేసింది. జీవో 571 ప్రకారం అద్దెను నిర్ణయిస్తే 60 ఏళ్లకుగాను ప్రభుత్వానికి రూ. 5,436 కోట్లు రావాలి. కేవలం రూ.1.47 కోట్లకు ఇంత ఖరీదైన భూమిని కట్టబెట్టారు. అంటే పార్థసారథిరెడ్డికి నేరుగా రూ.5,344 కోట్ల లబ్ది చేకూర్చారు.
వాస్తవానికి 15 ఎకరాలకు 1500 కోట్లు ఉంటే.. 505 కోట్లు మాత్రమే విలువ కట్టారు. 10శాతం రెంట్ వసూలు చేయాలంటే ఏడాదికి 50కోట్లు వసూలు చేయాలి. కానీ 50 కోట్ల రెంట్ వసూలు చేయకుండా 15 ఎకరాల కు మొత్తం 1లక్షా 50వేల ప్రకారం కేసీఆర్ పార్థసారధి రెడ్డికి కట్టబెట్టారు. భూమి విషయంలో అధికారుల ఆదేశాలు కాదని కేసీఆర్‌ భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ఇంత అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ భూ దోపిడీని సీరియల్ గా విడుదల చేస్తామని ప్రకటించారు. భూ దోపిడీతో కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించాడు. కేసీఆర్ దోపిడీకి సహకరించిన ఆ ఏడుగురు అధికారులు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. “ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది… ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్లను జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఖానామెట్ లో 41 సర్వే నెంబర్ లో 150 ఎకరాల భూమి ఉండేది. అందులో కేసీఆర్ 60 ఎకరాలు మాఫియాకు కట్టబెట్టారు. రేపు యశోదా హాస్పిటల్ కొల్లగొట్టిన భూములపై వివరాలు చెబుతా. ఖానామెట్ భూములపై ధారవాహికగా వివరాలు విడుదల చేస్తాం” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బీజేపీ కార్పొరేటర్ మోడల్ తీసుకొస్తే.. కేసీఆర్ మాఫియా మోడల్ తీసుకొచ్చారని విమర్శించారు. కేసీఆర్ కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్. అప్రమతంగా లేకపోతే మాఫియా మోడల్ రాజకీయాల్లో బలి కావాల్సి వస్తుందని రేవంత్ హెచ్చరించారు. మోదీ ని వదిలేస్తే పరిస్ధితి ఎలా తయారైందో… కేసీఆర్ ను వదిలేస్తే భవిష్యత్ లో మాఫియా నీడన బతకాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో దరిదాపుల్లోకి రాకుండా చూడాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కేసీఆర్ ను వదిలించుకోవాలని లేఖ రాస్తామని పేర్కొన్నారు. రూ. 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలోనే కేసీఆర్ లక్ష కోట్లు అవినీతి చేశారు. అదే 47 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే ఎంతో ప్రమాదకరమో ఆలోచించాలని అన్నారు. రాజకీయాల్లో కరుడు గట్టిన నెరగాడు, రాజకీయ జూదగాడు జాతీయ రాజకీయాల్లోకి రావడం ప్రమాదకరం. ఏ ఎన్నికల వచ్చినా కేసీఆర్‌ వందలాది కోట్లు ఖర్చు పెడు తున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు ఎంత? అని ప్రశ్నించారు. దీనిపై సీబీఐకి కూడా లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు రేవంత్‌.