తెదేపా అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆయన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు.
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆయన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. బుధవారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో వైకాపా నుంచి భారీ ఎత్తున తెదేపాలోకి చేరికలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరవుతారు. అనంతరం బందరు రోడ్డు మీదుగా మచిలీపట్నం వెళతారు. మూడు స్తంభాల సెంటర్ నుంచి కోనేరు సెంటర్ మీదుగా హిందూ కళాశాల వరకు రోడ్ షో నిర్వహించి అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం నిమ్మకూరు వెళతారు. అక్కడ తొలిసారి బస చేయబోతున్నారు. ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చంద్రబాబుకు బస ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు.
అనంతరం గుడివాడ చేరుకుని రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడ వీకేఆర్ వీఎన్బీ ఏజీకే కళాశాలలో బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శుక్రవారం అంబేడ్కర్ జయంతిలో, ఆ తర్వాత జిల్లాలోని పాస్టర్లతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ మీదుగా నూజివీడు వెళ్తారు. అక్కడ రోడ్ షో బహిరంగ సభలో పాల్గొని తిరిగి గన్నవరం చేరుకుంటారు.