Sports

CSK vs RR: మార్పులు తప్పలేదు.. స్విట్జర్లాండ్‌లో ఆడినట్లుంది: ధోనీ

CSK vs RR: మార్పులు తప్పలేదు.. స్విట్జర్లాండ్‌లో ఆడినట్లుంది: ధోనీ

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ చాలా స్లోగా ఉందని, సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ కీలక పాత్ర పోషించనుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు.

మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ కాస్త స్లోగా ఉన్నట్లు కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌ వికెట్ కంటే భిన్నంగా ఉంది. డ్యూ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించనుంది. సీఎస్‌కే సారథిగా 200వ మ్యాచ్ ఆడుతుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల మద్దతు అద్భుతం. పాత స్టేడియంలో ఐపీఎల్ జర్నీని మొదలుపెట్టాం. చాలా ఉక్కపోతగా ఉండేది. కానీ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో ఆడుతున్నట్లు ఉంది.

క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటికి ఇప్పటి టీ20 మ్యాచ్‌లకు చాలా తేడా ఉంది. మా జట్టును గాయాల బెడద వేధిస్తోంది. కొంత మంది ఆటగాళ్లు గాయాలతో తప్పని పరిస్థితుల్లో జట్టుకు దూరమయ్యారు. మిచెల్ సాంట్నర్, ప్రిటోరియస్ స్థానాల్లో తీక్షణ, మొయిన్ అలీ బరిలోకి దిగుతున్నారు. ‘అని ధోనీ చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. ‘మేం కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. టోర్నీలో మేం శుభారంభం అందుకున్నాం. ఆ మూమెంటమ్‌ను అలానే కొనసాగించాల్సిన అవసరం ఉంది. చాలా రోజుల తర్వాత చెపాక్‌లో ఆడుతున్నాం. అనుభవమైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్లు మా జట్టులో ఉన్నారు.

చెపాక్‌లో మ్యాచ్ ఆడటం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఫిట్‌నెస్ సమస్యలతో ట్రెంట్ బౌల్ట్ దూరమయ్యాడు. దాంతో జట్టులో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో తుది జట్టు వివరాలను వెల్లడించడం కష్టంగా మారింది.’అని సంజూ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మైర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), సిసండా మగలా, మహీశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్