ఇంటి చుట్టూ దట్టమైన చెట్లు ఉన్నాయా? తరచూ పాముల బెడద వేధిస్తుందా? ఇక అటువంటివారు పాములు బెడద నుండి తప్పించుకోవడానికి పాములను పట్టే వారిని పిలుస్తూ ఉంటారు. అయితే పాములను చంపకుండానే, అవి ఇంటి దరికి రాకుండా చేసుకోవచ్చు. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే వాటిని చంపకుండా సహజమైన కొన్ని విధానాలను పాటించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువగా ఉంటే, అవి కూడా బాగా గుబురుగా ఉంటే ఇంట్లోకి పాములు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లోకి పాములు రాకుండా ముందు గుబురుగా పెరిగిన చెట్లను కట్ చేయాలి. ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేస్తే పాములు శుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోకి రావు. ఇంటి పరిసరాలలోకి పదేపదే పాములు వస్తూ ఇబ్బంది పెడుతుంటే కార్బాలిక్ యాసిడ్ ను ఇంటి చుట్టూ చల్లడం వల్ల ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి. కార్బాలిక్ యాసిడ్ లేకపోతే సల్ఫర్ పొడిని చల్లినా కూడా పాము వెళ్ళిపోతుంది.
ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లినా బ్లీచింగ్ పౌడర్ వాసనకు పాములు పారిపోతాయి. అంతేకాదు వెల్లుల్లిని మెత్తగా చేసి ఏదైనా నూనెతో కలిపి ఒక రోజు ఉంచి, ఆ మిశ్రమాన్ని ఇంటి చుట్టూ చల్లడం వల్ల కూడా పాములు రాకుండా పోతాయి. ఇక నాప్తలిన్ బాల్స్ ను పౌడర్ గా చేసి ఆ పౌడర్ ని ఇంటి చుట్టూ చల్లినా పాములు రాకుండా ఉంటాయి.
అంతే కాదు పాములు రాకుండా ఉండాలి అంటే ఇంట్లోకి ఎలుకలు రాకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో చెత్తాచెదారం జమ చేయకుండా శుభ్రంగా ఉంచండి. ఇంటికి ఉన్న చిన్న చిన్న రంద్రాలను మూసివేసి జాగ్రత్తలు పడండి. ఇక పెరట్లో పిచ్చి మొక్కలు, గడ్డి గుబురుగా పెరగకుండా చూసుకోండి. ముఖ్యంగా పాములు రాకుండా ఉండాలి అంటే నిమ్మకాయ మొక్కను పెంచండి. నిమ్మ వాసన పాములకు అస్సలు పడదు. దీంతో పాములు ఇంటి పరిసరాలకు రావడానికి వెనకడతాయి.