పశ్చిమ టెక్సాస్‌లో ఘటన
డిమిట్‌లోని సౌత్ ఫోర్క్ ఫామ్‌లో భారీ పేలుడు
పేలుడు తర్వాత గంటపాటు దట్టమైన నల్లని పొగలు
ఇంత పెద్ద స్థాయిలో ఆవులు మృతి చెందడం ఇదే తొలిసారి
అమెరికాలోని పశ్చిమ టెక్సాస్‌లో ఓ డెయిరీ ఫామ్‌లో భారీ పేలుడు సంభవించిన ఘటనలో 18 వేల ఆవులు మృతి చెందాయి. పశువులు ఇంత పెద్ద స్థాయిలో మృతి చెందడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. డిమిట్‌లోని సౌత్ ఫోర్క్ ఫామ్‌లో పేలుడు తర్వాత మంటలు చెలరేగినట్టు ఆన్‌లైన్ న్యూస్‌పేపర్ ‘ది ఇండిపెండెంట్’ తెలిపింది. పేలుడు తర్వాత గంటపాటు డెయిరీ ఫామ్ పైన దట్టమైన నల్లటి పొగ అలముకుంది. ఈ ఘటనలో గోవులకు తప్ప మరెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గాయపడిన ఓ డెయిరీ ఫామ్ కార్మికుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొలుత అతడి పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
కబేళాల్లో బలవుతున్న వాటికంటే మూడు రెట్లు
అగ్నిప్రమాదంలో 18 వేల ఆవులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. అమెరికాలో ప్రతి రోజూ కబేళాల్లో వధిస్తున్న ఆవుల సంఖ్యకు ఇది మూడు రెట్లు కావడం గమనార్హం. చనిపోయిన ఆవుల్లో హోల్‌స్టీన్, జెర్సీ రకాల ఆవులున్నాయి. డెయిరీ ఫామ్‌లోని మొత్తం ఆవుల మందలో దాదాపు 90 శాతం మృత్యువాత పడ్డాయి.
భారీ ఆర్థిక నష్టం
డెయిరీ ఫామ్‌లో అగ్ని ప్రమాదానికి కారణమేంటన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే, ఏదైనా యంత్రం సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఇది జరిగి ఉంటుందని కౌంటీ జడ్జ్ మాండీ జిఫెల్లెర్ అంచనా వేశారు. టెక్సాస్ అగ్నిమాపక అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నారు. ఆవుల నుంచి పాలు పితికే సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా పెను నష్టం సంభవించింది. ఒక్కో ఆవు ఖరీదు 2 వేల డాలర్ల పై మాటే.
సౌత్ ఫోర్క్ డెయిరీ ఫామ్ కాస్ట్రో కౌంటీలో ఉంది. టెక్సాస్‌లోనే అత్యధికంగా ఇక్కడ పాలు ఉత్పత్తి అవుతాయి. టెక్సాస్ 2021 వార్షిక డెయిరీ రివ్యూ ప్రకారం క్యాస్ట్రో కౌంటీలో 30 వేలకు పైగా పశువులు ఉన్నాయి. 2013 తర్వాత ప్రమాదంలో ఆవులు ఈ స్థాయిలో చనిపోవడం ఇదే తొలిసారి.