ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయ హిందువులు మన ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను అక్కడ కూడా పాటిస్తున్నారు.ఏ దేశానికి వెళ్లినా మూలాలు మరిచిపోకుండా ముందుకు సాగుతున్నారు.అంతేకాదు.ఆయా ప్రాంతాల్లో హిందూ ఆలయాలను నిర్మిస్తున్నారు.
ఇప్పుడు అనేక దేశాలలో మన ఆలయాలు వెలుగొందుతుండటం వెనుక వీరి కృషి ఎంతో వుంది.తాజాగా ఆస్ట్రేలియాలో( Australia ) శ్రీవారి ఆలయ పునరుద్దరణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.
ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
సిడ్నీ( Sydney ) నగర శివార్లలోని హెలెన్స్బర్గ్లో( Helensburgh ) వున్న శ్రీ వెంకటేశ్వర ఆలయ పునరుద్దరణ వేడుకకు సింగపూర్, మలేషియా, మారిషస్‌ల నుంచి 15 మంది పూజారులు, సందర్శకులు హాజరయ్యారు.
అలాగే స్థానిక ఇండియన్ కమ్యూనిటీ నుంచి 20 వేలమంది భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పవిత్రోత్సవం, కుంభాభిషేకం తదితర ప్రత్యేక క్రతువులను వేదపండితులు నిర్వహించారు.అనంతరం పూజారులు ఆలయ గాలి గోపుర శిఖరం పైకి చేరుకుని పవిత్ర జలాన్ని బంగారు కుండలపై పోశారు.
కాగా.భారతదేశం వెలుపల వున్న అతిపెద్ద హిందూ దేవాలయాల్లో హెలెన్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి.గతేడాది జూన్‌లో 3 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లతో పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు నిర్వాహకులు.
ఈ ఆలయంలో వున్న డజన్లకొద్దీ దేవతా విగ్రహాల నిర్మాణం, మరమ్మత్తుల కోసం భారతదేశం నుంచి 10 మంది నిపుణులను, శిల్పులను రప్పించారు.వందలాది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ వారాంతాల్లో స్థానిక కాంట్రాక్టర్లతో కలిసి ఆలయంలో పనిచేశారని మీడియా తెలిపింది.ప్రస్తుతం ఆలయ పునరుద్దరణ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలావుండగా.గత కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ మద్ధతుదారులు( Khalistani supporters ) వీరంగం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి వాటిపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు, భారత వ్యతిరేక రాతలను రాస్తున్నారు.దీనిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ ఘటనలకు కారణమవుతున్న వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సూచించింది.