తల్లితో గొడవపడి ఆమెపై ఫిర్యాదు చేయడానికి 11 ఏళ్ల బాలుడు తన అమ్మమ్మ ఇంటికి బయలు దేరాడు. ఈ క్రమంలో ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. మరి అతడు అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడా? పిర్యాదు చేశాడా? ఇంతకీ ఏం జరిగిందంటే.
చైనాకు చెందిన ఓ బాలుడు తన తల్లితో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురైన అతడు తన తల్లిపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నాడు. దీంతో మిజియాంగ్లో ఉన్న అమ్మమ్మ ఇంటికి సైకిల్పై బయలుదేరాడు. రహదారిపై ఉన్న గుర్తుల సాయంతో పయనించసాగాడు. ఇంటి నుంచి వెంట తెచ్చుకున్న బ్రెడ్, మంచినీళ్లతో కడుపు నింపుకున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. నిజానికి తన అమ్మమ్మ ఇంటికి ఒక గంటలో చేరుకోవచ్చు. కానీ, ఒక రోజు గడిచినా అమ్మమ్మ ఇల్లు రాలేదు. ఎందుకంటే అతడు దారి తప్పిపోయాడు. ఓ చోట అలసిసొలసి ఒంటరిగా ఉన్న ఆ బాలుడిని చూసి కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి సాహసాన్ని చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. నడవలేని స్థితిలో ఉన్న బాలుడిని కారులో సమీప పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తన తల్లిదండ్రులకు, అమ్మమ్మకు సమాచారం అందించి బాలుడిని వారికి అప్పజెప్పారు. కోపంలో అతడిని అమ్మమ్మ ఇంటికి వెళ్లాలని బెదిరించినట్లు బాలుడి తల్లి తెలిపింది. అయితే అతడు నిజంగా అలా చేస్తాడని భావించలేదని పేర్కొంది. బాలుడి కథ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. రాత్రి సమయంలో ఎంతో ధైర్యంగా ప్రయాణించిన బాలుడిని పలువురు అభినందిస్తుంటే.. మరికొందరు బాలుడి అమ్మమ్మ తన తల్లికి ఎలా బుద్ధి చెప్పిందో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు.