రమణ మహర్షి వర్ధంతి
_________
మౌనమే శోధన..
ఆ మౌనమే సాధన..
అదే భాష..
అదే గుండె ఘోష..
మనిషై పుట్టి జ్ఞానమార్జించి.. మదమాత్సర్య
రాగద్వేషాలను నిర్జించి
ఐహిక భోగాలను విసర్జించి
మహర్షిగా అవతరించి..
రమణుడు రమణ మహర్షి
అయినాడు..
జగతిని ఉద్దరించినాడు!
ఆ మౌనం
అర్థం చేసుకుంటే
అదే జ్ఞానం..
ఉపనిషత్తులను మించి..
వేదాలను గ్రహించి
తాను నిగ్రహించి..
భక్తులను అనుగ్రహించిన
రమణుడి మౌనంలోనే
గీతసారం..
ఆ మౌనం వీడి మాటాడితే
అదప్పుడు సకల వేదసారం!
సమాధి..ముక్తికి పునాది..
అయితే మరణించాక
శవమై చేరేది కాదు..
ఉన్నప్పుడే ప్రకృతి
నీ వశమై
సాధించే అలౌకిక పథం..
దేవుని చేరేందుకు
అదే రమణుడి విధం..
భగవంతుణ్ణి చేరేందుకు
అదే ఆయుధం..!
అరుణాచలం..
ఏంటో అంత అనుబంధం
ఆ పేరు వినగానే అల్లరి కుర్రాడు
వెంకట్రామన్ లో
ఓ కదలిక..
అప్పుడే మొదలై అంతర్మథనం..
ఆధ్యాత్మికతకు దొరికింది
సరికొత్త మూలధనం..
మౌనమే అయింది మానధనం..!
నమ్మని చలం కూడా
నచ్చిన వైనం..
ఆ మొండిఘటం మైదానం
ఒకనాటికి అయింది
రమణస్థానం..
ఆ భిన్నధృవాల..
విభిన్న దృక్పథాల
బంధానికి నిజస్థానం..!
అలా ఏదో ఒక దశలో
మారి ఉంటుందేమో
పెంకి మనిషి ప్రస్థానం!!
నేను ఎవరు..
ఈ ప్రశ్న రమణుడిదే..
సమాధానమూ ఆయనదే..
ఎన్నో సందేహాలకు ఆయన దేహమే జవాబు..
ఎన్నెన్నో సాధించినా
ఆయన నిత్య గరీబు..
కాని..తిరుగులేని
ఆధ్యాత్మిక నవాబు!!
భగవానుడి వర్థంతి సందర్భంగా
కోటి నమస్సులతో..
________