Sports

కోహ్లీ తగ్గేదే లే… వరుసగా రెండో అర్ధసెంచరీ

కోహ్లీ తగ్గేదే లే… వరుసగా రెండో అర్ధసెంచరీ

బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్,టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ,
20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు,34 బంతుల్లో 50 పరుగులు చేసిన కోహ్లీ.

డైనమిక్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి వరుసగా రెండో అర్ధసెంచరీ జాలువారింది. ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన బెంగళూరు బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది.

ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఆడి అర్ధసెంచరీ సాధించాడు. కోహ్లీ 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.

కోహ్లీ అవుటైన తర్వాత మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. లోమ్రోర్ 18 బంతుల్లో 2 సిక్సులతో 26 పరుగులు చేయగా, మ్యాక్స్ వెల్ 14 బంతుల్లో 3 సిక్సులతో 24 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుట్ కావడంతో బెంగళూరు స్కోరు మందగించింది.

ఆఖర్లో షాబాద్ అహ్మద్ 12 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 22 పరుగులు చేశాడు. కోహ్లీ, డుప్లెసిస్ జోడీ తొలివికెట్ కు 42 పరుగులు జోడించి శుభారంభం అందించింది. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ నిలదొక్కుకోలేకపోయారు.

ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కు వచ్చిన యువ బ్యాటర్ అనుజ్ రావత్ 15 పరుగులు చేయడానికి 22 బంతులు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ మార్ష్ 2, కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ 1, లలిత్ యాదవ్ 1 వికెట్ తీశారు.