ప్రస్తుతం ఐపీఎల్ 2023లో సూపర్ ఫామ్‌లో ఉన్న ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆడిన నాలుగు మ్యాచుల్లో కోహ్లీ మూడింట హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అద్భుతమైన అర్ధశతకంతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది సరైన నిర్ణయమే అని ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అన్నాడు.
అయితే ఢిల్లీ నుంచి మ్యాచ్ కోహ్లీనే లాగేసుకున్నాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధనాధన్ షాట్లు ఆడిన కోహ్లీ.. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఆ తర్వాత ఫుల్ టాస్ బంతికి మరో భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. ఇదే విషయాన్ని చోప్రా కూడా గుర్తుచేశాడు. టాస్ గెలిచిన తర్వాత డేవిడ్ వార్నర్ చాలా సంతోషంగా కనిపించాడని చెప్పాడు.
టాస్ ఓడిపోగానే ఫాఫ్ చాలా అప్‌సెట్‌గా కనిపించాడు అదే సమయంలో డేవిడ్ వార్నర్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పి సంతోషంగా కనిపించాడు. కానీ తొలి ఓవర్ నుంచే కోహ్లీ సూపర్‌గా ఆడాడు. ఆన్రిచ్ నోకియా వేసిన ఆ ఓవర్లో రెండు బౌండరీలు కూడా బాదాడు. తన ఆటతీరు కూడా సూపర్‌గా ఉంది. అచ్చం 2016లో ఆడినట్లే కోహ్లీ ఆడుతున్నాడు. అదే నిలకడ, స్ట్రైక్ రేట్ మెయిన్‌టైన్ చేస్తున్నాడు’ అని చోప్రా వెల్లడించాడు. 2016 ఐపీఎల్‌లో కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ ఏడాది ఐపీఎల్‌లో 973 పరుగులు చేశాడు, ఇప్పటికీ ఒక ఎడిషన్‌లో ఒక ప్లేయర్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇదే.
అదే సమయంలో ఆర్సీబీ తీసుకున్న ఒక నిర్ణయం తనకు నచ్చలేదని కూడా చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అనూజ్ రావత్‌ను తీసుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. రావత్ ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేశాడు. అతని కన్నా హసరంగ, వేన్ పార్నెల్‌లో ఎవరో ఒకరు మెరుగ్గా ఆడేవాళ్లని చెప్పాడు. అంతేకాదు, రావత్ చేసిన స్కోరు వాళ్లిద్దరిలో ఎవరైనా సులభంగా చేసేవాళ్లని తెలిపాడు. రావత్ ఇన్నింగ్స్ చాలా పేలవంగా ఉందని సూటిగా చెప్పేశాడు.