Politics

ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ‘భారతీయన్స్’ : వెంకయ్యనాయుడు

ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ‘భారతీయన్స్’ : వెంకయ్యనాయుడు

హైదరాబాద్, సూర్య ప్రత్యేక ప్రతినిధి : రోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ హీరోలుగా, సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన సినిమా ‘భారతీయన్స్’. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఫేమ్) చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. మంచి సినిమా తీశారని చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయం. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందించారు. దీనికి చాలా సంతోషం. దేశభక్తి చిత్రాలను యువత, ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ‘నేను ఇంతకు ముందే సినిమా చూశా. వెంకయ్య నాయుడు చూస్తున్నారని తెలిసి మళ్లీ వచ్చా. సమాజానికి, మన దేశానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటేనే సినిమాలను ప్రోత్సహించడానికి వస్తారు. దర్శక, నిర్మాతల్లో ఎంతో దేశభక్తి ఉంటేనే ఇటువంటి సినిమాలు వస్తాయి. తప్పకుండా ప్రేక్షకులు అందరూ సినిమా చూడాలని అన్నారు.

దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ ‘ వెంకయ్య నాయుడు సినిమా చూసి మమ్మల్ని అభినందించడం ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దర్శకుడిగా నాకు మొదటి సినిమా ఇది. ‘కలిసుందాం రా’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘ప్రేమించుకుందాం రా’ తదితర హిట్ సినిమాలకు వర్క్ చేశా. దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా’ అని అన్నారు.