భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఆరు రకాల నూతన ఆర్జిత సేవలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. వేద ఆశీర్వచనం, స్వామి వారికి తులసిమాల అలంకరణ, ఉదయాస్తమాన సేవ, శ్రీరామనవమి ముత్యాల సమర్పణ, నిత్య పూలఅలంకరణ సేవ, తులాభారం సేవల ప్రారంభానికి దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ నుంచి అధికారిక ఆమోదం లభించడంతో ఆదివారం వాటిని లాంఛనంగా ప్రారంభించారు. తొలి రోజున వేద ఆశీర్వచనం టికెట్‌ను దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి కొనుగోలు చేయగా.. బేడా మండపంలో ఈవోతో పాటు మరికొందరు భక్తులకు వేద ఆశీర్వచనం అందజేశారు. అలాగే తులాభారం తొలిటికెట్టును స్థానాచార్యులు కేఈ స్థలశాయి కొనుగోలు చేయగా.. చిత్రకూట మండప ప్రాంగణంలో జరిగిన తులాభారంలో ఆయనే స్వయంగా పాల్గొని రామయ్యకు మొక్కు తీర్చుకున్నారు.