ఈనెల 30 వ తేదీ లోపు సుప్రీంకోర్టుకు చెప్పినట్టు విచారణ పూర్తిచేసే అవకాశం తక్కువ
ఇప్పటికే రాష్ట్ర రాజు, రాణి పిఏ లకు నోటీసులు
యువరాణులను చూసేందుకు లండన్ వెళ్తోన్న రాజు, రాణి
కోటలోకి సిబిఐ ని అడుగుపెట్టనిస్తారా?… విచారణకు పిలిస్తే వారు వస్తారా??
సిబిఐ చార్జిషీట్ ఆధారంగా
హు కిల్డ్ బాబాయ్ సినిమా తీస్తే బాగుంటుందేమో…
పార్టీ పరువు తీసిన సజ్జల భార్గవ్ రెడ్డి
సజ్జలభార్గవ్ మాదిరిగా ఎప్పుడైనా సజ్జల, సాయి రెడ్డిలు అడ్డంగా దొరికిపోయారా ?
కోడి కత్తి కేసు తుస్సుమనడం, వైఎస్ వివేక కేసులో అరెస్టులను చూస్తే పార్టీ భవిష్యత్తు ఏమిటోనని భయమేస్తుంది
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదివారం ఉదయం సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకోగా, మరో 48 గంటల వ్యవధిలో ఇంకొక కీలక అరెస్టు ఉండే అవకాశాలు లేకపోలేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. సదరు కీలక అరెస్టుకు మూడు,నాలుగు గంటల సమయం పడుతుందా?, లేకపోతే 48 గంటల వ్యవధి సమయం పడుతుందా?? అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… హైకోర్టులో సోమవారం నాడు డాక్టర్ సునీత తరపు న్యాయవాది తో పాటు, సిబిఐ తరఫు న్యాయవాది వాదనలను వినిపించనున్నారు. ఇప్పటికే జరిగిన రెండు అరెస్టులతో పాటు, కోర్టుకు వెళ్లే లో గానే కీలకమైన మూడవ అరెస్టు కూడా జరిగితే, తమ పనిని తాము చేసుకునే వెసులుబాటు కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి కి సిబిఐ అధికారులు విన్నవించే అవకాశాలు లేకపోలేదు. ఈనెల 30వ తేదీలోగా సుప్రీం కోర్టు చెప్పినట్లుగా విచారణ పూర్తి చేయలేరని అనుకోవడం లేదన్న రఘురామకృష్ణంరాజు, పూర్తిచేసే అవకాశాలు కూడా తక్కువేనని వ్యాఖ్యానించారు. రాజు, రాణి వ్యక్తిగత సహాయకులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. రాజు, రాణిలతో మాట్లాడాలనుకుంటే వారేమో యువరాణులను చూడడానికి లండన్ వెళ్తున్నారు.దానితో వారు విచారణకు హాజరయ్యే అవకాశం లేదు. నిత్యం ప్రజా సంక్షేమం గురించే ఆలోచిస్తున్నానని చెప్పుకునే రాజు గారు , కోర్టులకు కూడా హాజరు కావడం లేదని, ఆయన విచారణకు హాజరవుతారా? అన్న సందేహాలు లేకపోలేదు అన్నారు. చార్జీ షీట్ దాఖలు చేసిన తరువాత, విస్తృత కోణాన్ని చూడమన్నారు కాబట్టి ఆ కోణంలో పరిశోధించి, మరొక చార్జి షీట్ దాఖలు చేస్తామని చెప్పే అవకాశాలు లేకపోలేదన్నారు. హైకోర్టులో కేసులలో వాయిదా లతో తీవ్రమైన జాప్యం చేసిన నేపథ్యంలో, మరొక ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి నెల రోజుల సమయాన్ని అడగవచ్చు. ఈ కేసులో రాజు, రాణి ని విచారించడానికి కోటలోకి సిబిఐ ని అడుగుపెట్టనిస్తారా?, విచారణకు పిలిస్తే రాజు, రాణి వస్తారా?? అన్నది అనుమానమే. ఈ కేసు మరింత ఆలస్యం కావచ్చు. తమ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లోను పిటిషన్ మూవ్ చేయవచ్చు. ఇప్పటివరకు పులివెందుల, కడపలో శాంతియుత నిరసన దీక్షలు చేస్తున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు , రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించే అవకాశాలు లేకపోలేదని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
అత్యంత ధనవంతుడే హత్య టాస్క్ అప్పచెప్పి ఉండాలి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు టాస్క్ ను అత్యంత ధనవంతుడైన వ్యక్తి అప్ప చెప్పి ఉండాలి. లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయవలసిన అవసరం కనిపించడం లేదు. ఈ హత్యకు సూత్రధారులుగా భావిస్తున్నట్టు గా అభియోగాలను ఎదుర్కొంటున్న వారు మంచివారని పులివెందుల ప్రజలు అంటున్నారు కాబట్టి, వైఎస్ వివేకను చంపాల్సి వచ్చిందంటే వారికి ఎవరి నుంచైనా ఆదేశాల వచ్చి ఉంటే చంపి ఉండవచ్చునని రఘురామకృష్ణం రాజు అన్నారు. హత్య టాస్క్ అప్పచెప్పిన ధనవంతుడు ఎవరు?, విచారణ అనేది ఆ దిశగా సాగుతుందా?, హత్యలో పాల్గొన్న వారికి ముందు ఇచ్చిన అడ్వాన్స్ తో సరిపుచ్చి, ఇస్తామని చెప్పిన మిగతా సొమ్మును ఎగగొట్టాలని వీరే భావించారా? అన్నది తెలియాల్సి ఉంది. వైఎస్ వివేకా హత్య నేరాన్ని టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పై తొసి వేయాలని చూశారు. దీనితో వారు దెబ్బతిన్న పులిలా మాదిరిగా ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. వైఎస్ వివేక హత్య కేసు నిష్పక్షపాతంగా సిబిఐ చేత విచారణ జరిపించాలని డాక్టర్ సునీతతో పాటు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలు కూడా హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు.
రాజ ద్రోహం కేసు పెట్టినవారు రాజుయే కదా?
తనపై గతంలో రాజ ద్రోహం కేసును మోపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో కూడా ఈ రాష్ట్రానికి ప్రభువే కదా అని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో ఇప్పటికే రాజు గారి ఓఎస్ డి ని , రాణి గారి అనుచరుడి ని సిబిఐ అధికారులు విచారణకు పిలిచారు. ఈ కేసులో తిమింగలాలను వదిలి, చాపలను పట్టుకుంటున్నారన్న బీటెక్ రవి వ్యాఖ్యలను తప్పు పట్టలేమన్నారు. బీటెక్ రవి మాట్లాడే మాటలలో లాజిక్ ఉన్నప్పటికీ, అది నిజమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తమ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నిజం కాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. గతంలో సిబిఐ అధికారులు పిత్తబరిగలను మాత్రమే పట్టుకున్నారని, నేడు చాపలను పడుతున్నారని, రేపు తిమింగలాలను కూడా పట్టుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. సోమవారం నాడు అనంతపురంలో నిర్వహించదలచిన రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిసిందని, ప్రత్యేక హోదా కోసం, ఈ ఏడాదిలో పోలవరం ప్రోగ్రెస్ కేవలం 0.83 శాతమేనని పేపర్లలో వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి తో చర్చించడానికి ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయేమోనంటూ ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి ప్రయత్నించి ఉంటారని, అపాయింట్మెంట్ లభిస్తే ప్రత్యేక హోదా, పోలవరం పనుల ప్రగతి గురించి చర్చించే అవకాశాలు లేకపోలేదని అపహస్యం చేశారు.
పగవాడికైనా ఈ కష్టం రావద్దు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కష్టం మగవాడికైనా రావద్దని రఘు రామకృష్ణంరాజు అన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్ తోపాటు, భవిష్యత్తులో అవినాష్ రెడ్డి అరెస్టు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా సీబీఐ ని డకోట ఆర్గనైజేషన్ అని విమర్శించే సాహసాన్ని జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నారు. ఒకవేళ సిబిఐ ని ఆయన విమర్శిస్తే, ఆర్థిక నేరాభియోగ కేసుల విచారణలో గత నాలుగేళ్లుగా కోర్టుకు హాజరుకాకపోయినా మినహాయింపునిస్తున్న సి.బి.ఐ ఆగ్రహించే అవకాశం ఉందని, అటు బంధువుల అరెస్టు ని ఖండించనూ లేక, ఇటు సిబిఐ ను విమర్శించను లేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి షాక్ లో ఉండి ఉంటారు. గతంలో ముఖ్యమంత్రి చెప్పిన తోకడా కథలన్నీ మీడియా ముందు చెప్పిన సజ్జల, ఇప్పటికీ ఇప్పుడు గతంలో చెప్పిన కథలన్నీ సమర్ధించుకుంటూ, కొత్త స్క్రీన్ ప్లేతో స్టోరీ చెప్పాలంటే, సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి వంటి దర్శకులతో స్టోరీ స్క్రీన్ ప్లే రాయించ వలసి ఉంటుందన్నారు. అందుకే, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పటికీ మీడియా ముందుకు రాలేకపోయి ఉంటారు. కష్టకాలంలోనే ఒకరికి ఒకరు అండగా ఉండాలని, ఈ సమయంలో నే మాట పడిపోయినట్లుగా మీడియా ముందుకు రాకపోవడం దురదృష్టకర పరిణామమని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుపై లోక్ సభ స్పీకర్ కు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందేమోనన్న మీడియా ప్రతినిధి ప్రశ్నపై, రఘురామకృష్ణం రాజు స్పందిస్తూ అటువంటి అవసరం ఏది లేదని అన్నారు. గతంలో తనని అరెస్టు చేసినప్పుడు లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి తరువాతే తెలియజేశారని పేర్కొన్నారు.
అరెస్టు ఖాయమని తెలిసే ప్రత్యేక హోదా కోసం పోరాటాలు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ బంధువుల అరెస్టు తప్పదని తెలిసే ముఖ్యమంత్రి జగన్ మోహన్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ పెద్దల వద్ద పోరాటాలు చేశారని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. అరెస్టును తప్పించుకోవడానికి సుప్రీంకోర్టులో, హై కోర్టులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన కృష్ణారెడ్డి లు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని అటు సుప్రీం కోర్టులోనూ, ఇటు హైకోర్టులోను పిటిషనర్లు ప్రశ్నించగా న్యాయస్థానాలు ఛీ పొమ్మన్నాయి. అయినా కేసు విచారణలో జాప్యం జరిగేలా హైదరాబాద్ హైకోర్టులోను కేసులు వేశారు. ఈ కేసులను వాదించడానికి ఒక్కసారి కోర్టుకు హాజరైతే ఐదు లక్షల రూపాయల ఫీజులు తీసుకుని న్యాయవాదులను పిటిషనర్లు నియమించుకోవడం అనుమానాలకు తావునిస్తోంది. పిటిషనర్ల తరఫున ఖరీదైన లాయర్లను నియమించిన వారు ఎవరనీ ఆరా తీస్తే, అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యవాదులు, పాలకుల చేత హింసించబడిన ప్రజలంతా ఎదురు చూస్తున్న అరెస్టులు జరగడం పట్ల సర్వత్రా ఆనందం వ్యక్తమౌతోంది. వైఎస్ వివేక హత్య కేసులో తొలుత పాత్రధారులను అరెస్టు చేసిన సిబిఐ అధికారులు, ఆధారాలన్నీ సమకూర్చుకొని సూత్రధారులు ఎవరో అరెస్టు చేసే పనిలో ఉన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకొని అరెస్టు చేయడం పట్ల సూత్రధారులుగా అనుమానిస్తున్న వారి న్యాయవాదులు అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జాలి వేస్తోంది. హత్యకు ముందు రోజు 2019 మార్చి 14 వ తేదీన సాయంత్రం 6 గంటల 14 నిమిషాల నుంచి ఆరున్నర గంటల మధ్య నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్, సూత్రధారిగా అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారన్నది గూగుల్ టేక్ అవుట్ ద్వారా స్పష్టం అయ్యింది. వివేక హత్య అనంతరం కూడా నిందితులు భాస్కర్ రెడ్డి ఇంటికి వచ్చినట్టు తేలింది. ఈ కేసులో మరొక కీలక వ్యక్తి అయిన గజ్జల ఉదయ భాస్కర్ రెడ్డి కూడా భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలిసింది. వైఎస్ వివేకానంద రెడ్డి ది గుండెపోటుతో సహజ మరణ మని చెప్పి కన్నీళ్లు కార్చి ప్రజలని నమ్మించాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు తిరగాబడ్డాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
ఆధారాలు లేకుండా సిబిఐ ముందుకు వెళ్లే అవకాశం లేదు
ముఖ్యమంత్రి అడ్డుగోడలా నిలిచినప్పటికీ, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులను ఆధారాలు లేకుండా అరెస్టు చేసేందుకు సిబిఐ ముందుకు వెళ్లే కాశం లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత హు కిల్డ్ బాబాయ్ అనే వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తీస్తే బాగుంటుంది. వైఎస్ వివేక హత్య కేసులో నిజదోషులను పట్టించే వరకు డాక్టర్ సునీత అవిశ్రాంత పోరాటం చేయాలి. పాత్రధారులు, ఇప్పటివరకు అరెస్టు అయిన సూత్రధారులతో కేసు ముగిసిపోలేదు. ఇంకా పట్టుదలతో ముందుకు వెళ్లితండ్రి రుణం తీర్చుకోవాలి. సునీత పోరాటం మహిళా లోకానికి ఆదర్శం. ఆంధ్ర ప్రజలు ప్రజాస్వామ్య వాదుల తరపున సునీతకు ఆమె భర్తకు అభినందనలు తెలియజేస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.
ఒరేయ్ భార్గవ పార్టీ పరువు తీసేశావు కదరా…
ఒరేయ్ భార్గవ నీ వినూత్న విధానాలతో పార్టీ పరువు తీసేశావు కదరా అంటూ రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. ఆర్ కే యం ఆర్ అనే వ్యక్తితో అవినాష్ రెడ్డి ని చూస్తే గౌతమ బుద్ధుడిని చూస్తున్నట్లుగా ఉందని చెప్పించిన భార్గవ్ రెడ్డి, అదే ఆర్కే ఎం ఆర్ తో మెడలో కండువా మార్పించి తెలుగుదేశం పార్టీ బ్యాక్ గ్రౌండ్ లో, టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ ఎస్సీ, బీసీలను తూలనాడారని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్ కే ఎంఆర్ ద్వారా వేషం కూడా మార్పించకుండా, మార్చి మార్చి చెప్పించడం ద్వారా సాధించాలనుకున్నది ఏమిటో అర్థం కావడం లేదు. గతంలో సజ్జల భార్గవ్ రెడ్డి తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి, సాయి రెడ్డిలు సోషల్ మీడియా వ్యవహారాలను నిర్వహించేటప్పుడు ఇలా ఏరోజైనా అడ్డంగా
దొరికిపోయారా? డీసెంట్ గా ఉండేవారు. అడ్డంగా దొరికిపోవడం ఏమీ బాగాలేదు భార్గవ్. ఏదైనా చేయాలంటే దొరకకుండా చేయాలి. సోషల్ మీడియాలో మనల్ని ఎలా దంచేస్తున్నారో చూడు. ఇలా అయితే జనాల్లో ఎలా తలెత్తుకు తిరగాలి. కోడి కత్తి కేసు తుస్సు మని పించకా, వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టులు జరుగుతుంటే పార్టీ భవిష్యత్తు ఏమిటోనని భయమేస్తోంది. ఈ విషయాన్ని సజ్జల పుత్రరత్నమైన భార్గవ రెడ్డి తెలుసుకోవాలని పార్టీలో ఉన్న, ఉంచుకున్న వ్యక్తిగా చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు.