అలలా ఎగసి
అలా ఎగిరి
రాలిన సౌందర్యం..!
_______
ఆమెను చూస్తే..
చిలకమ్మకే అసూయ..
అందాలు ఆరబోసే
ప్రకృతికే ముచ్చట..
కురిసే ప్రతి వానచినుక్కీ
తనను తాకి
పులకించాలనే కోరికే..
చినుకు పడే సాయంత్రం
అల నీలిగగనాన విరిసే
సప్తవర్ణ శోభిత ఇంద్రధనస్సు
తనను మించిన వర్ణాలను
ఆమెలో గాంచి
అచ్చెరువొందలేదా..
పచ్చని చెట్టు సందుల నుంచి
ఇంకా పచ్చటి రెల్లు గడ్డిపై పడి మరింత
శోభాయమానమయ్యే
నులి వెచ్చటి కిరణాలు
ఒక్క నిమిషం
ఆగి చూసి వెళ్ళే
ముగ్ధమనోహర రూపమది..
అన్ని అందాల కలబోతగా
ఆ సౌమ్య సౌందర్యమై..
వెండి తెర వేలుపై..
సాంప్రదాయ సంతకమై..
తానే ఒక అపురూప పుస్తకమై..!
సావిత్రిలా అభినయానికి..
జమునవోలె అందానికి..
వాణిశ్రీ వలె ఆత్మాభిమానానికి..
తనకే ప్రత్యేకమైన
ఓ శిల్ప సౌందర్యానికి
నిలువెత్తు రూపం
ఈ అందాల భరిణె..!
రమ్యకృష్ణలా చీకులమ్మే
చిన్నది అవ్వలేదు..
కాజల్లా పక్కా లోకల్ అనిపించుకోలేదు..
తమన్నా మాదిరి
ఆజ్ రాత్ మేరా ఘర్ మే
పార్టీ హై అనలేదు..
పరాకాష్టగా అంగాంగ ప్రదర్శనకు ఎప్పుడూ
ఊ అనలేదు..
చక్కని అభినయానికి
ఉహూ చెప్పలేదు..
అసభ్యత..అశ్లీలం..
అసలేం గుర్తుకు రావు
ఆ ముద్దుగుమ్మను చూస్తుంటే..
అసలు ఆ నవ్వులోనే
అందమైన ఎన్నో పూలు
పూస్తుంటే..!
అటు పౌరాణికం వైపూ
ఓ చూపు..
ద్రౌపదిగా కుదిరింది
ఆమె రూపు..
అంతలోనే విధి చిన్నచూపు
గగనం నుంచి
దిగివచ్చిన తార..
ఆ గగనంలోనే రాలిపోయింది..
ఈలోగా మన హృదయాల్లో
చెరగని ముద్ర..
ఆ అభినయ సముద్ర..!!