Vande Bharat: తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాల మీదుగా నడిపేందుకు నిర్ణయించింది. అందులో ఒకటైన సికింద్రాబాద్ – బెంగళూరు వందేభారత్ ప్రారంభించటానికి దాదాపు ముహూర్తం ఫైనల్ చేసారు.
ఇందుకు సంబంధించి రూట్ కూడా ఖరారు అయింది. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 11 గంటలుగా ఉన్న ప్రయాణం, వందేభారత్ ద్వారా ఏడు గంటల్లోనే గమ్య స్థానం చేరుకునేలా షెడ్యూల్ సిద్దం అవుతోంది.
మరో వందేభారత్ సిద్దం: ఈ ఏడాది జనవరిలో తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందేభారత్ సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకు ప్రారంభించారు. ఈ నెలలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో సర్వీసు అందుబాటులోకి వచ్చింది. రెండు రైళ్లకు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ ఉండటంతో మరో రెండు రైళ్ల నిర్ణయం పైన రైల్వే శాఖ అడుగులు ముందుకు వేస్తోంది.
సికింద్రాబాద్ నుంచి బెంగుళూరు, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి పూణేకు మరో వందేభారత్ ప్రారంభించేలా ఇప్పటికే రైల్వే అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా ముందుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాచిగూడ నుంచి బెంగళూరు మధ్య వందేభారత్ ప్రారంభానికి కసరత్తు తుది దశకు వచ్చింది. వచ్చే నెల 21న ఈ రైలు ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం.
రూట్ పైన క్లారిటీ: ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు ప్రతీ రోజు ఏడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో అవసరమైన మేర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. అయినా రద్దీకి తగినట్లుగా రైళ్లు లేకపోటంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయివేట్ బస్సులకు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు రూట్లలో రైళ్లు నడుస్తున్నాయి.
వికారాబాద్ , తాండూరు, రాయచూరు, గుంతకల్లు మీదుగా ఒక లైన్ ఉంది. అదే విధంగా మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా మరో మార్గం ఉంది. ఈ మార్గం మీదుగా ఇప్పుడు కాచిగూడ – బెంగళూరు వందేభారత్ సర్వీసు ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నారు. ట్రాక్ సామర్ధ్యం గురించి అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ఏడు గంటల్లోనే గమ్యస్థానానికి: రెండు ఐటీ సిటీల మధ్య వందేభారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ఈ రెండు సిటీల మధ్య రైల్వే ప్రయాణానికి ప్రస్తుతం 11 గంటల వరకు సమయం పడుతోంది. వందేభారత్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం 7 గంటల్లో గమ్యస్థానం చేరుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రూట్ షెడ్యూల్ పైన దాదాపు క్లారిటీ రావటంతో, టైమింగ్స్ పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా దేశ వ్యాప్తంగా 75 వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ రైలుతో పాటుగా సికింద్రాబాద్ – పూణే మధ్య వందేభారత్ ప్రారంభానికి అధికారులు సిద్దం అవుతున్నారు.