వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత.. అప్పటి ప్రతిపక్షనేత జగన్, వైకాపా నేతలు పొంతనలేకుండా మాట్లాడారు.
వివేకా హత్య కేసులో తొలి నుంచీ పొంతనలేని మాటలు
గుండెపోటు అని ఒకరు.. రక్తపు వాంతులని మరొకరు
చంద్రబాబే చేయించారంటూ జగన్ ఆరోపణలు
‘నారాసుర రక్తచరిత్ర’ అని సాక్షిలో నిలువెత్తు ప్రచారం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత.. అప్పటి ప్రతిపక్షనేత జగన్, వైకాపా నేతలు
పొంతనలేకుండా మాట్లాడారు. గాయాలు కళ్లెదుటే కనిపిస్తున్నా.. రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారనుకున్నామని ఒకరు, గుండెపోటుతో చనిపోయారని మరొకరు చెప్పారు. తర్వాత అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన జగన్మోహన్రెడ్డి.. వివేకాను చంద్రబాబే హత్య చేయించారని ఆరోపణలు గుప్పించారు. రాజకీయ ఆధిపత్యం కోసమే హత్య జరిగిందని అవినాశ రెడ్డి విమర్శలు సంధించారు. వివేకాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే హత్య చేయించారంటూ మొదట తమ సొంత పత్రిక సాక్షిలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చేతిలో కత్తి పట్టుకుని నిల్చున్నట్లుగా చంద్రబాబు నిలువెత్తు చిత్రంతో.. ‘నారాసుర రక్త చరిత్ర అంటూ ఎర్ర రంగులడ్డారు. ఉన్నతస్థానానికి ఎదగడానికి కుట్రలు, కుతంత్రాలు, హత్యల మార్గాన్ని చంద్రబాబు ఎంచుకున్నారని పేర్కొన్నారు. మహానేత కుటుంబాన్ని కడతేర్చే కుట్ర, అధికారం అండతో హత్యాకాండ అనే శీర్షికలతో కథనాలను వండి వార్చారు. చిన్నాన్న హత్య కేసులో సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేయడంతో పాటు గవర్నరు కలిసి ఫిర్యాదు చేసిన జగన్.. తాను సీఎం అయ్యాక సీబీఐ అవసరం లేదని
నాలుక మడతేశారు.
సీబీఐతో విచారణ చేయించాలి
ప్రతిపక్షనేత హోదాలో జగన్మోహన్ రెడ్డి
వివేకా చనిపోతూ రాశారంటూ పోలీసు అధికారులు ఓ లేఖ చూపారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.. చిన్నాన్నను పడక గదిలో బెడ్ పక్కన.. గొడ్డలితో నరికారు. తలమీద అయిదు సార్లు గొడ్డలితో నరికారు. చిత్రీకరించే బాత్రూంలో మూర్ఛ వచ్చి పడిపోయి కమోడ్ కొట్టుకుని కింద పడిపోయి చనిపోయినట్లుగా ప్రయత్నం చేశారు. ఇందులో ఒకరు కాదు.. పలువురు ఉన్నారు. లేఖ కూడా కల్పితమే. ఈ వ్యవహారమంతా కుట్రకోణం నుంచి పక్కకు పోయేలా దగ్గరుండి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. సీబీఐ విచారణ చేయించాలి. నిజాలు బయటకు రావాలి. చేసిన వాళ్లు ఎంత పెద్దవారైనా.. ఎందుకు చేశారనేది బయటకు రావాలి. మూలాల దగ్గరకు పోవాలి. రాష్ట్రంలో రాజకీయాలు దారుణంగా జరుగుతున్నాయి.”
చంద్రబాబే ఈ పని చేశారు.
2019 మార్చి 18న గవర్నర్కు ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో జగన్మోహన్రెడ్డి
‘చంద్రబాబు ఈ పని (వివేకానందరెడ్డి హత్య) చేసి.. నా మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారు. వాళ్లను ఢీకొట్టేందుకు వివేకానందరెడ్డి ప్రచారం చేస్తున్నారనే.. మనిషినే లేకుండా చేశారు. నిజంగా చంద్రబాబు ప్రమేయమే లేకుంటే కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎందుకు వెనకాడుతున్నారు?’
వివేకా హత్య కేసు సీబీఐకి బదిలీ చేయాలి
2019 మార్చి 19న హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రతిపక్షనేతగా జగన్
‘వివేకా హత్య కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు, చంద్రబాబుతో ప్రమేయం లేని నిష్పక్షపాత దర్యాప్తు సంస్థకు అప్పగించాలి. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలి
సీబీఐ దర్యాప్తు అవసరం లేదు.
-2020 ఫిబ్రవరి 6వ హైకోర్టులో ముఖ్యమంత్రిగా జగన్
‘వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఎలాంటి ఉత్తర్వులు అవసరం. లేదు, పిటిషన్ మూసేయాలి. దాన్ని ఉపసంహరించుకుంటున్నాం’
ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది.
– 20:21 నవంబరు 10వ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి-
‘వై.ఎస్.వివేకానందరెడ్డి నాకు చిన్నాన్న, మా నాన్న సొంత తమ్ముడు. మరోవైపు అవినాష్రెడ్డి. నా మరో చిన్నాన్న కొడుకు. ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది? ఎందుకు చేస్తారు అధ్యక్షా? మా చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసి ఉంటే వాళ్లే (తెదేపా) చేసి ఉండాలి. కానీ వక్రీకరించి మా కుటుంబంలోనే చిచ్చుపెడుతున్నారు. ఇలాంటి విషయాలన్నీ మాట్లాడితే ఒక్కోసారి బాధేస్తుంది. దురదృష్టకరం’
వివేకా గుండెపోటుతో మరణించడం బాధాకరం
సంఘటనా స్థలంలో విజయసాయిరెడ్డి, వైకాపా ఎంపీ
వివేకానందరెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం బాధాకరమైన విషయం. 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ఎంపీగా ప్రజా జీవితానికి అంకితమైన వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోవడం బాధాకరం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
చంద్రబాబు, లోకేశ్, ఆదినారాయణరెడ్డిల ప్రమేయం
అదేరోజు హైదరాబాద్లోని వైకాపా కార్యాలయంలో విజయసాయి రెడ్డి
వివేకానందరెడ్డి హత్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కుటుంబాన్ని అంతం చేయాలని తెదేపా కుట్రలు పన్నుతోంది. హత్యకు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ అయితే.. కుట్రను ఆదినారాయణరెడ్డి అమలు చేశారు.
మొదట రక్తపు వాంతులయ్యాయని అనుకున్నాం.
• వైఎస్. అవినాష్ రెడ్డి, 2019, మార్చి 15న
మా పెదనాన్న వివేకానందరెడ్డి మరణంపై మాకు పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతున్నాయి. మొదట రక్తపు వాంతులు అయ్యాయేమో అని అనుకున్నాం. రక్తపు వాంతులు కాదని అనిపించింది. ఆయన తలపై పెద్ద గాయాలు రెండు ఉన్నాయి. ముందు నుంచి ఒకటి, వెనుకవైపు మరింత పెద్దగాయం ఉంది. వేళ్లకు, ముఖంపై గాయాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఆయన మృతిపట్ల మాకు అనుమానాలు ఉన్నాయి. ఇందులో కుట్ర కోణాన్ని బయటకు తీయాలి.
నేను అన్నింటికీ సిద్ధమై ఉన్నాను
– వైఎస్ భాస్కర్రెడ్డి, మార్చి 12న కడప కేంద్ర కారాగారం వద్ద విలేకరులతో
“నాకు తెలిసిన విషయం ఒక్కటే చెబుతాను. ఈ కేసు పరిష్కారం కావాలంటే ఆ లెటర్ విషయం తప్ప వేరే మార్గంలేదు. ఎన్ని విచారణ ఏజెన్సీలు వచ్చినా ఆ లెటర్ విషయం కనుక్కుంటే, అసలు విషయం బయటకు వస్తుంది. అవన్నీ పక్కదోవ పట్టించి దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి న్యాయమైన పద్ధతిలో చేయమని సీబీఐని చేతులెత్తి కోరుతున్నాను. నేను అన్నింటికీ సిద్ధమై ఉన్నాను.