ఆస్ట్రేలియాలోని ఐదు విశ్వవిద్యాలయాలు( Australian universities ) కొన్ని భారతీయ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల రాకపై నిషేధం విధించడం కలకలం రేపుతోంది.మోసపూరిత దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆస్ట్రేలియాలో చదివే విదేశీ విద్యార్ధుల పరంగా 2019లో 75,000 వేల మంది భారతీయ విద్యార్ధులు( Indian students ) ఆసీస్‌లోని పలు వర్సిటీలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్ తీసుకున్నారు.అయితే ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ విద్యార్ధుల పెరుగుదల ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ, దేశ సమగ్రత, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మార్కెట్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని చట్టసభ సభ్యులతో పాటు విద్యా రంగ నిపుణుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ విషయాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తాపత్రిక మంగళవారం నివేదించింది.మరోవైపు ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలు తమ రిస్క్ రేటింగ్ డౌన్ గ్రేడ్ చేయబడకుండా ముందస్తుగానే విద్యార్ధుల రాకపై ఆంక్షలు విధిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
ది ఏజ్, ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తాపత్రికలు జరిపిన పరిశోధనలో విక్టోరియా యూనివర్సిటీ, ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వోలోంగాంగ్, టోరెన్స్ యూనివర్సిటీ, సదరన్ క్రాస్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఏజెంట్లు భారతీయ విద్యార్ధుల దరఖాస్తులను తగ్గించడంపై దృష్టి పెట్టారు.ఈ విషయంలో కొన్ని భారతీయ రాష్ట్రాలకు మాత్రమే ఆంక్షలు విధించాయి సదరు యూనివర్సిటీలు.
పెర్త్ లోని ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయం( Edith Cowan University ) ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన విద్యార్ధుల దరఖాస్తులపై పూర్తి నిషేధం విధించింది.ఆ తర్వాత మార్చిలో విక్టోరియా యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ సహా మరో ఎనిమిది భారతీయ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధుల దరఖాస్తులపై పరిమితులు విధించింది.ఇదే బాటలో వోలోంగాంగ్ సైతం భారత్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, లెబనాన్, మంగోలియా, నైజీరియా తదితర దేశాలకు చెందిన విద్యార్ధుల “genuine temporary entrant” టెస్ట్‌పై షరతులను విధించింది.
దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారతదేశ పర్యటన ముగించుకుని వచ్చిన కొద్దిరోజులకే ఆస్ట్రేలియా యూనివర్సిటీలు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.మరి దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.