Business

మెటా ఉద్యోగులకు షాక్​

మెటా ఉద్యోగులకు షాక్​

మరో 10,000 మంది లేఆఫ్​!

టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. గతేడాది నవంబరులో 11 వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా తాజాగా మరో 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 వేల మంది ఉద్యోగులను తీసేసిన డిస్నీ.. ఇప్పుడు మరో విడతలో వేలాది ఉద్యోగులను తొలగించనుంది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మరింత మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యయ నియంత్రణలో భాగంగా దాదాపు మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని మెటా నిర్ణయించినట్లు సమాచారం. మెటా పరిధిలో ఉన్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వర్చువల్‌ రియాలిటీపై పనిచేస్తున్న రియాలిటీ ల్యాబ్‌.. ఇలా అన్ని వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మేనేజర్లకు అంతర్గతంగా మెటా సమాచారం పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చిలోనే సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ దీనిపై సంకేతాలిచ్చారు. అన్ని విభాగాల్లో సిబ్బంది కూర్పును పునఃసమీక్షించి కంపెనీ సామర్థ్యాన్ని మరింత పెంచాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తాజాగా లేఆఫ్‌లకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. మే నెలలో మరికొంత మందిని కూడా మెటా తీసివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.గతేడాది నవంబరులోనే కంపెనీ సిబ్బందిలో 13 శాతానికి సమానమైన 11,000 మందిని మెటా తొలగించింది. అలాగే కొత్త నియామకాలనూ నిలిపివేసింది. తాజాగా మేనేజర్లకు పంపిన సమాచారంలో కంపెనీలోని ఉద్యోగుల బృందాలన్నింటినీ పునఃనిర్మించనున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్‌ తెలిపారు. లేఆఫ్‌ల తర్వాత కొంతమంది కొత్త ప్రాజెక్టులపై పనిచేయాల్సి రావొచ్చని స్పష్టం చేశారు.